Currency in Mobile Pouch :మగాళ్లు జేబుల్లో, పర్సులో డబ్బు దాచడం సహజం. ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగులో ఉంచుతారు. అయితే.. ఈ మధ్య జనాలు మొబైల్ ఫోన్ పౌచ్ వెనక డబ్బు దాచుకోవడం కూడా మొదలు పెట్టారు. ఇలా డబ్బు దాచేవారిలో మహిళల సంఖ్యే అధికం. బయటికి వెళ్తే చేతిలో మొబైల్(Mobile) ఉంటుంది కాబట్టి.. ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ డబ్బు ఉపయోగపడుతుందనే భావనతో ఇలా చేస్తుంటారు. కానీ.. అలా ఫోన్ వెనుక డబ్బులు దాచుకోవడం డేంజర్ అని మీకు తెలుసా? కొన్నిసార్లు ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉంటుందట! మరి.. అంత ఉపద్రవం ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Risk for Hide of Currency in Mobile Pouch :ఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున లేచింది మొదలు.. అర్ధరాత్రి పడుకునే సమయం వరకు ఫోన్ వాడుతూనే ఉంటారు. ఇలా ఎక్కువగా వాడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు.. ఫోన్ ఒక్కోసారి వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. అప్పుడు ఆ ప్రభావం కనిపించేది మొబైల్ వెనుక వైపే కదా! కాబట్టి అలాంటప్పుడు మీ ఫోన్ వెనుక వైపు కరెన్సీ, క్రెడిట్ కార్డులు, షాపింగ్ బిల్లులు వంటివి ఉంటే.. వేడి తీవ్రమై మంటలు చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. కరెన్సీ తయారు చేయడానికి కాగితంలోపాటు అనేక రకాల రసాయనాలను వినియోగిస్తారు. ఆ రసాయనాలు మంటలను వేగంగా ఆకర్షిస్తాయి. తద్వారా.. ఒక్కోసారి పేలుళ్లూ సంభవించి ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పాచ్ల విషయంలో ఆ జాగ్రత్తలు తప్పనిసరి :క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి పెట్టడం వల్ల కూడా పలు సమస్యలు వస్తాయి. వీటి మీద మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఉంటాయి. వీటిని ఫోన్ వెనక పెట్టడం వల్ల అవి డీమాగ్నటైజ్ అవుతాయి. దీంతో కార్డులు పని చేయకుండా పోయే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి కార్డులు కూడా మొబైల్ వెనుక పెట్టకపోవడం మంచిది.
ఇక, ఫోన్ రక్షణ కోసమని కొందరు.. ఆకర్షణీయంగా ఉండాలని మరికొందరు.. రకరకాల పౌచ్‌లను వాడుతుంటారు. అయితే.. అవి మరీ టైట్‌గా ఉండకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి బిగుతుగా ఉంటే ఫోన్ నుంచి వెలువడే వేడి బయటకు పోదు. దాంతో ఒత్తిడి పెరిగి మొబైళ్లు పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకూ మొబైల్ వెనుక భాగం పూర్తిగా కప్పేయకుండా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.