Aaraga Jnanendra: పశువుల అక్రమ రవాణా కట్టడిలో విఫలమైనందుకుగాను పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచం తీసుకుంటూ శునకాల్లా నిద్రపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే వారు ఎలాంటి శిక్ష అనుభవించకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది.
"పశువులను తరలిస్తున్న వారు తరచూ అక్రమ రవాణాలకు పాల్పడేవారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ మీరు లంచాలు మరిగి కుక్కల్లా నిద్రపోతున్నారు. మీకు ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఇప్పటివరకు నేను ఈ విషయంపై ఏం మాట్లాడలేదు. కానీ నేను హోంమంత్రిగా కొనసాగాలా వద్దా? మొత్తం పోలీస్ వ్యవస్థే కుళ్లిపోయింది. మేము జీతాలు ఇస్తున్నా మీరు వాటితో సంతృప్తి చెందక లంచాలకు అలవాటు పడ్డారు."
--ఫోన్కాల్లో పోలీసులపై మంత్రి జ్ఞానేంద్ర
ఈ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు మంత్రి జ్ఞానేంద్ర. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం అందడం వల్లే ఆగ్రహంలో అలా మాట్లాడానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం అవినీతికి పాల్పడే పోలీసుల గురించేనని, అందరిపైనా కాదని స్పష్టం చేశారు.