Apsara Murder Case Remand Report In Hyderabad :పెళ్లిచేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిన యువతిని కిరాతకంగా హతమార్చాడు. ఆమెను హత్య చేయడానికి ఆన్‌లైన్‌లోనూ శోధించాడు. నిందితుడు అయ్యగారి వెంకట సాయికృష్ణ.... అప్సరను ఈఏడాది మార్చి నుంచే మట్టుబెట్టాలని పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతిని హతమార్చిన తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా..... పట్టుబడకుండా ఆధారాలు చెరిపేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad Apsara Murder Case Update : సరూర్‌నగర్‌కు చెందిన అప్సరను హత్య చేసిన నిందితుడు వెంకట సాయికృష్ణపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి చంపేశాక మృతదేహాన్ని దహనం చేసే అవకాశం లేక రెండ్రోజులు కారు డిక్కీలోనే ఉంచాడని పోలీసులు పేర్కోన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనూ శోధించాడని తెలిపారు. యువతిని చంపాక.. ఆమె ముఖాన్ని గుర్తించలేని విధంగా బండరాయితో పాశవికంగా కొట్టాడని రిపోర్ట్‌లో వెల్లడించారు. ముఖంపై కళ్లు, ముక్కు, నోరు ఇతర భాగాలన్నీ ఏ మాత్రం గుర్తించలేని విధంగా చిధ్రం చేశాడని పోలీసులు తెలిపారు.
Hyderabad Apsara Murder Case Latest News :నిందితుడు సాయికృష్ణ సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతను ఇంటి సమీపంలో ఉన్న గుడిలో వేదపాఠశాల, గోశాల, నిత్య అన్నదాన సత్రం నిర్వహిస్తున్నాడు. అతనికి గతేడాది ఏప్రిల్‌లో కురుగంటి అప్సరతో పరిచయమైంది. ప్రతిరోజు ఆలయానికి వచ్చే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇద్దరి బంధం మరింత బలపడి వివాహేతర సంబంధంగా మారింది. రెండు నెలల తర్వాత అప్సర గర్భవతి అని తేలింది. మూడో నెల ఉన్న సమయంలో సాయికృష్ణ ఆమెకు గర్భస్రావం చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అప్సర ఈ ఏడాది మార్చిలో ఒత్తిడి చేసింది. వివాహం చేసుకోకపోతే విషయాన్ని అందరికీ చెప్పి పరువు తీస్తానని, ఫోటోలు బయటపెడతాననే బెదిరించింది.... దీంతో విసిగివెసారిపోయిన సాయికృష్ణ.... ఈ వ్యవహారం బయటకు పొక్కితే సమాజంలో తన పరువుపోతుందన్న ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని మార్చిలో పథకం వేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు..
అప్సరను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించిన సాయికృష్ణ..మూడు నెలల నుంచి అవకాశం కోసం ఎదురుచూశాడు. హత్యకు అనువైన ప్రదేశం కోసం మార్చిలో హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రాంతాల్లో తొలిసారి రెక్కీ చేశాడని పోలీసులు రిపోర్ట్‌లో పేర్కోన్నారు. చివరకు తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే నర్కుడలోని ఖాళీ వెంచర్‌ను ఎంచుకున్నాడు. వారం రోజుల క్రితం మనిషిని ఎలా చంపాలని ఇంటర్‌నెట్‌లో వెతికి.. కొన్ని మెలకువలు తెలుసుకున్నాడని పోలీసులు వివరించారు.
DCP on Shamshabad Woman Murder : 'కారుకు కప్పే కవర్‌తో చంపేందుకు యత్నం.. తిరగబడటంతో రాయితో మోది హత్య'
కోయంబత్తూరు వెళ్దామంటూ అప్సర గతంలో కొన్నిసార్లు సాయికృష్ణను కోరింది. ఈ నెల 3 తేదీన వెళ్దామని చెప్పిన సాయికృష్ణ..శంషాబాద్ దగ్గర చివరి బస్సు రాత్రి 9 గంటలకు ఉందని, టికెట్లు బుక్ చేశానని నమ్మించాడు. కారు కవరు, బెల్లం దంచే రాయిని అప్పటికే కారులో సిద్ధం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి శంషాబాద్ చేరుకుని రాత్రి 11 గంటలకు వరకూ అక్కడే తిరిగారు. ఆ తర్వాత పర్యటన రద్దయిందని సూల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్దామంటూ సర్దిచెప్పాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు గోశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే కారులో నిద్రిస్తున్న యువతిని సాయికృష్ణ తెల్లవారుజాము మూడున్నర గంటలకు వెనుక నుంచి కారు కవరుతో ఆమె ముఖంపై పెట్టి చంపే క్రమంలో యువతి బిగ్గరగా కేకలు వేసింది. భయపడ్డ నిందితుడు వెంటనే బెల్లం కొట్టే రాయితో కొట్టాడు. ఆమె చనిపోయినట్లు నిర్థారించుకున్నాక..... యువతి దుస్తులు ఇతర సామాగ్రిని అక్కడే దహనం చేశాడని పోలీసులు తెలిపారు.
అప్సర మృతదేహాన్నిఅక్కడే తగలబెట్టడానికి కట్టెలు అందుబాటులో లేక దాదాపు గంటన్నర అక్కడే తిరిగాడు. మరో అవకాశం లేక కారు కవర్లో మృతదేహాన్ని చుట్టి ఉదయం ఐదున్నర గంటలకు సరూర్‌నగర్‌లోని తన నివాసానికి చేరుకున్నాడు. మార్గమధ్యంలో యువతి పాదరక్షలు, కారు కవరును పొదల్లో విసిరేశాడు. నాలుగో తేదీ మధ్యాహ్నం అప్సర ఇంటికెళ్లి ఆమె తల్లిని కలిశాడు. అప్సర కోయంబత్తూరు వెళ్లలేదని..... స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానంటే శంషాబాద్‌లో దించేశానని ఆమెను నమ్మించాడు. రెండ్రోజుల తర్వాత అప్సర ఫోన్ స్విచాఫ్ వస్తోందంటూ తల్లి చెప్పడంతో.. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటూ చెప్పాడు. ఆమె ఫిర్యాదుతో శంషాబాద్ ఠాణాలో కేసు నమోదైంది.
ఈనెల 5వ తేదీ ఇంటికొచ్చాక రాత్రి 8 గంటలకు తన కారులోని అప్సర మృతదేహం నుంచి దుర్వాసన వస్తోందని గ్రహించాడు సాయికృష్ణ..... అదే రోజు రాత్రి 9 గంటలకు సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోని మ్యాన్‌హోల్‌లో మృతదేహాన్ని విసిరేశాడు. మృతదేహం విసిరేసిన ప్రాంతానికి మరుసటి రోజు వెళ్లిన నిందితుడు దుర్వాసన వస్తోందని గ్రహించి.. ఎలాగైనా దాన్ని ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించాడు. రెండు ట్రిప్పుల ఎర్రమట్టితో మ్యాన్‌హోల్ మూయించాడు. 7వ తేదీన ఆ ప్రాంతంలో వాసన ఆగకపోవడంతో మ్యాన్‌హోల్ పాతబడి దుర్వాసన వస్తోందంటూ అందర్నీ నమ్మించి.. కూలీలను తెప్పించి మరీ కాంక్రీటుతో శాశ్వతంగా కప్పేశాడు. ఇంతటి దురాగతం చేసిన నిందితుడు తన కుటుంబ సభ్యులు, అప్సర తల్లి సహా ఎవ్వరికీ అనుమానం రానివ్వలేదు. వీలైనంత మేర సాక్ష్యాల్ని విధ్వంసం చేయడం, పోలీసుల్ని ఏమార్చేందుకు యత్నించాడు. యువతి అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు..... చివరిసారిగా ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్, సీసీ టీవీపుటేజీలను పరిశీలించగా.... ఇతర ఆధారాలతో ఈ నెల 9వ తేదీన దొరికిపోయాడు. ఒకవేళ అప్సర మృతదేహం దొరికినా ఆమె ఎవరో గుర్తించలేకుండా ముఖాన్ని ఛిద్రం చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడని పోలీసులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి :