Dastagiri Allegations on CM Jagan and Avinash: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేకా కూతురు సునీతమ్మ నుంచి డబ్బులు తీసుకున్నామన్న ఆరోపణలను దస్తగిరి ఖండించాడు. ఒక్క రూపాయి డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైళ్లో ఉండేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర ఉంది కాబట్టే.. సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తున్నారని దస్తగిరి స్పష్టం చేశారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డి నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం ఉందని ఆరోపించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో మీడియా సమావేశం నిర్వహించిన దస్తగిరి పలు కీలక విషయాలు వెల్లడించాడు. తాను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని.. అప్రూవర్‌గా మారే వేళ అవినాష్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాడు. మీ వరకు రానంతవరకు మంచోడిని.. ఇప్పుడు చెడ్డవాడినా? అని దస్తగిరి ప్రశ్నించాడు. వివేకా కూతురు సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని.. ఒకవేళ డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో కూర్చోడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
"నేను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. అప్రూవర్‌గా మారేవేళ అవినాష్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు?. మీవరకు రానంతవరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు చెడ్డవాడినా?. సునీత, సీబీఐ నుంచి నేను రూపాయి కూడా తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే. అప్పుడు డబ్బుకు ఆశపడే ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశాం. ఇప్పుడు నాకు అవసరం లేదు కనుకే సీబీఐకి నిజం చెప్పేశా." దస్తగిరి, వివేకా హత్య కేసులో అప్రూవర్