Apple Warning State Sponsored Attack :యాపిల్ నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయని ఆరోపించారు పలువురు ప్రతిపక్ష ఎంపీలు. తమ ఫోన్లపై ప్రభుత్వ ప్రాయోజిత దాడులు జరుగుతున్నట్లు అందులో ఉందన్నారు. ఫోన్లు హ్యాక్‌కు గురై.. డేటా చోరి జరిగే అవకాశం ఉందని యాపిల్ తమను హెచ్చరించిందని తెలిపారు. ఈ వార్నింగ్ మెసేజ్‌లు అందిన వారిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చదుర్వేది, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఉన్నారు. యాపిల్ నుంచి వచ్చిన వార్నింగ్ స్క్రీట్షాట్లను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"మెయిల్, టెక్స్ట్ రూపంలో యాపిల్ నుంచి నాకొక హెచ్చరిక అందింది. ప్రభుత్వం నా ఫోన్‌ను, మెయిల్‌ను హాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది." అని మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు కూడా ఇలాంటి మెసేజ్‌లు అందాయని ఆమె పేర్కొన్నారు. చతుర్వేది కూడా తనకు వచ్చిన వార్నింగ్ స్క్రీన్షాట్లను షేర్ చేశారు. శశిథరూర్ సైతం యాపిల్ నుంచి తనకు కూడా వార్నింగ్ మెయిల్ అందిందని తెలుపుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు నేతలు.
"మీ ఫోన్ హాక్కు గురైందని మేము భావిస్తున్నాం. యాపిల్ ఐడీ ఆధారంగా ఈ దాడి జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు అనే దానిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగవచ్చు. ఈ అటాక్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తే.. మీ సున్నితమైన డేటా, కమ్యూనికేషన్, కెమెరా, మైక్రోఫోన్‌ను రిమోట్‌గా అటాకర్లు యాక్సెస్ చేయగలరు." అని నేతలు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఉంది.
మండిపడ్డ రాహుల్..
ప్రతిపక్షనేతలకు యాపిల్ నుంచి అందిన వార్నింగ్ మెసేజ్‌లపై కాంగ్రెస్ అగ్రనేత తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలకు కూడా ఇలాంటి మెసేజ్‌లు అందాయన్న రాహుల్.. చాలా మంది ఫోన్లు హ్యాకింగ్ గురవుతున్నాయని ఆరోపించారు.
"మా ఫోన్లను వీలైనంత వరకు ట్యాప్ చేయండి. అయినా మేము భయపడం. వాటిని నేను పట్టించుకోను. నా ఫోన్ కావాలన్న మీకు ఇస్తాను. నేను ఇంతకు ముందు మోదీ నంబర్ 1, అదానీ నంబర్ 2, అమిత్ షా నంబర్ 3 అనుకునేవాడిని. కానీ అది తప్పు. అదానీయే నంబర్ 1, మోదీ నంబర్ 2, అమిత్ షా నంబర్ 3. భారత రాజకీయాలను మేము అర్థం చేసుకున్నాం. అదానీ తప్పించుకోలేరు." అని రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోదీ ఆత్మ.. అదానీ దగ్గర ఉందన్నారు రాహుల్. అదానీని తాకగానే నిఘా వర్గాలు మోహరిస్తాయని విమర్శించారు.
సానుభూతి పొందేందుకే ఆరోపణలు..
కొంత మంది ఫోన్లు హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందనే ఆరోపణలతో.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ అన్నారు. దీనిపై యాపిల్ నుంచి స్పష్టత కోసం ఎందుకు వేచి చూడలేకపోతున్నారు? అని విపక్ష ఎంపీలను ప్రశ్నించారు.
మెసేజ్‌లపై యాపిల్ వివరణ..
స్టేట్ స్పాన్సరెడ్ అటాకర్ల దాడిని ఎవ్వరికి ఆపాదించమని తెలిపింది యాపిల్. ఈ దాడులు చేసేవారు అధునాతనంగా ఆలోచిస్తారని.. కాలక్రమేణా ఆ దాడులు పెరగొచ్చని పేర్కొంది. తరచూ దాడులను గుర్తించడం కష్టమైన పని అని తెలిపింది. అయితే కొన్ని బెదిరింపు నోటిఫికేషన్లు తప్పుగా ఉండొచ్చని, కొన్నింటిని పసిగట్టలేకపోచ్చని యాపిల్ వెల్లడించింది. బెదిరింపు నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి కారణాల గురించి తాము చెప్పలేకపోయామని పేర్కొంది.