తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP CID: ప్రతిపక్షాలపైనే ఏపీ సీఐడీ వేటు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులే - AP CID

AP CID Harassments: రాష్ట్రంలోని నేర పరిశోధక విభాగం ‘ఘోర’ పరిశోధక విభాగంలా మారిపోయిందా? ఇదేదో అధికార వైసీపీకి అనుబంధ విభాగమా అనేలా వ్యవహరిస్తోందా? రాష్ట్రంలో ప్రతిపక్షాలకు సామాజిక మాధ్యమ విభాగాలు ఉండకూడదని చట్టమేమైనా చేశారా? వాటిని నిషేధించారా? అధికార వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం విచ్చలవిడితనానికి, విశృంఖలత్వానికి ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించారా? గత నాలుగేళ్లుగా ఏపీ సీఐడీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అవుననే అనిపిస్తుంది.

AP CID
ఏపీ సీఐడీ

By

Published : Jul 1, 2023, 9:53 AM IST

ప్రతిపక్షాలపైనే సీఐడీ ప్రతాపం

AP CID is Harassing Opposition Leaders: "రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవటంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ట ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు’. ఒక సందర్భంలో పోలీసులను ఉద్దేశించి హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలివి. కానీ రాష్ట్ర పోలీసులు ముఖ్యంగా సీఐడీ పోలీసులు తీరు ఏమాత్రం మారలేదు. హైకోర్టు వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి ఇళ్లల్లోని మహిళలపై సామాజిక మాధ్యమాల్లో బూతులతో పోస్టులు పెడుతూ.. నీచంగా ట్రోలింగ్‌కు పాల్పడే వైసీపీ వారిపై వందల కొద్దీ ఫిర్యాదులు అందుతున్నా.. కనీసం కేసు కూడా నమోదు చేయని సీఐడీ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలపై సామాజికమాధ్యమాల్లోపోస్టులు పెట్టే వారిని మాత్రం వేధిస్తోంది. దర్యాప్తు అధికారులు విచారణ పేరిట పిలిపించి అసలు కేసుతో సంబంధంలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన సమాచారం రాబట్టేలా విచారిస్తున్నారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని.. అందులోని కాంటాక్ట్‌ నంబర్లు, సందేశాలు, ఇతర వివరాలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే పోస్టులుపెట్టడాన్ని ఎవరూ హర్షించరు. అది అధికార పార్టీ వారు చేసినా, ప్రతిపక్ష నాయకులు చేసినా తప్పే. ఇలాంటివారు ఎవరైనా సమానంగా చర్యలు ఉండాలి. కానీ.. అధికార వైసీపీ నాయకులు ఎంతటి నేరానికి తెగబడినా తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టినా తప్పే అన్నట్లు.. ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించడం పైనే అభ్యంతరం.

దివంగత మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై 2021లో నమోదైన ఓ కేసులో.. ఐటీడీపీ కార్యకర్త బేతమాల మణిరత్నం అలియాస్‌ మంచోడు మణిని సీఐడీ అధికారులు తాజాగా విచారించారు. ఈ సందర్భంగా ‘ఐటీడీపీ ఎలా పనిచేస్తుంది? అందులో పనిచేసేవారికి వేతనం ఇస్తారా? వైసీపీకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీకు ఏమొస్తుంది? తెలుగుదేశం కోసం ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం మీకేంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మిమ్మల్ని ఎవరైనా చంపేస్తే దిక్కెవరు?’ అంటూ బెదిరింపు, హెచ్చరిక ధోరణిలో దర్యాప్తు అధికారి తనను ప్రశ్నలు అడిగారని విచారణ అనంతరం మణి మీడియాకు వివరించారు.

తన ఫోన్‌ తీసుకుని 4 గంటలు శోధించి అందులోని వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకున్నారని ఆరోపించారు. మణిపై ఏవైనా ఆరోపణలు, అభియోగాలుంటే వాటికి సంబంధించి విచారించొచ్చు. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, అధికార వైసీపీ తరఫున వకల్తా పుచ్చుకున్నట్లుగా దర్యాప్తు అధికారులు విచారించడం ఏమిటి? వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీకు ఏమొస్తొంది వంటి ప్రశ్నలు దేనికి సంకేతం? సీఐడీ ఉన్నది ప్రజల పక్షాన పనిచేయటానికా? వైసీపీ ప్రయోజనాలు పరిరక్షించటానికా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

"గతంలో నాపై ఆరు కేసులు పెట్టారు. ఓ ఒక్క కేసు రుజువు కాకపోయినా.. నాపై మరో కేసు పెట్టి గంటల తరబడి విచారించారు. గంజాయి కేసులు పెడ్తామని, అక్రమ కేసులు, సీఐడీ కేసులు పెడ్తామని చెప్పి బెదిరించారు. నాకు సంబంధం లేని కేసులు పెట్టి.. నన్ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు." -మంచోడు మణి, ఐటీడీపీ కార్యకర్త

ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత పోలీసులది. పోలీసు శాఖలో అంతర్భాగమైన సీఐడీ అధికారులు ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ఎవరైనా చంపేస్తే నీకు దిక్కెవరు? అంటూ ఐటీడీపీ కార్యకర్త మణిని ప్రశ్నించటాన్ని ఎలా చూడాలి? ‘విచారణ పేరిట నా ఫోన్‌ను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని.. వైసీపీ వారికి చేరవేశారు. అప్పటి నుంచి వారంతా ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు’అంటూ.. మణి ఆరోపించారు. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన సీఐడీ అధికారులే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించడం ఏమిటి? మణి ప్రాణాలకు హాని జరిగితే.. దానికి బాధ్యత సీఐడీది కాదా? అసలు వ్యక్తిగత సమాచారం తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి ఏమొచ్చింది? ఎవరికి.. చేరవేయడం కోసం ఈ సమాచారాన్ని తీసుకుంటున్నారు? ఒక్క మణి వ్యవహారంలోనే కాదు తొలి నుంచీ సీఐడీది తీరు ఇలాగే ఉంది.

తెలుగుదేశం నాయకురాలు గౌతు శిరీషను ఒక కేసులో గతేడాది విచారించిన సీఐడీ అధికారులు.. ఆమె సామాజిక మాధ్యమ ఖాతాల పాస్‌వర్డ్‌లు అడిగి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఆమె ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారందరి వివరాలను.. ఆరా తీసి, వారెవరో చెప్పాలని ప్రశ్నించారు. వారందరి గురించి చెప్పాల్సిన పనిలేదని.. ఆమె సమాధానమిచ్చినా ఊరుకోలేదు. ఆమె ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారి వివరాలు.. సీఐడీ అధికారులకు ఎందుకు? ఆమె వ్యక్తిగత వివరాలతో వారికేం పని? ఇది హక్కులను హరించడం కాదా? ‘సీఐడీ అధికారులు ఓ కాగితంపై వారికి నచ్చినట్లు రాసుకొచ్చి.. దానిపై సంతకం చేయాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని అప్పట్లో శిరీష ఆరోపించారు.

ఓ కేసు వ్యవహారంలో టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ సమన్వయకర్త అప్పిని వెంకటేశ్‌ను గతేడాది జూన్‌లో సీఐడీ అధికారులు విచారించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల ప్రొద్బలంతోనే.. పోస్టులు పెట్టినట్లు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారాని ఆయన ఆరోపించారు. వారిద్దరి పేర్లు చెబితే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామంటూ ప్రలోభపెట్టారని ఆవేదనకు లోనయ్యారు. లోకేశ్‌కు ఫోన్‌ చేసి సీఐడీ కార్యాలయం వద్దకు రప్పించాలంటూ ఒత్తిడి చేశారు అని అప్పట్లో వెంకటేశ్‌ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారించాల్సిన సీఐడీ అధికారులు ప్రతిపక్ష పార్టీలోని ముఖ్య నాయకుల్నిలక్ష్యంగా చేసుకుని వారి పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి తీసుకు రావడం ఏంటి?.

ప్రతిపక్ష పార్టీల్లోని మహిళల చిత్రాలను అభ్యంతరకరంగా, ఆశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, నీచమైన కామెంట్లు జోడించటం వంటివి వ్యవస్థీకృతంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైసీపీ నేతలు, సామాజికమాధ్యమ విభాగ కార్యకర్తలే ఈ దారుణాలకు పాల్పడుతున్నారంటూ గత నాలుగేళ్లలో వందల ఫిర్యాదులందినా వాటిపై సీఐడీ అసలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఐటీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, సామాజికకార్యకర్తలు, ఇతర ప్రతిపక్ష పార్టీల వారిని అనేకమందిని విచారణ పేరిట వేధించి వారి వ్యక్తిగత గోప్యత, రాజకీయ సమాచారాన్ని కొల్లగొట్టిన సీఐడీ ఈ నాలుగేళ్లలో అధికార వైసీపీకి చెందిన ఒక్కరంటే ఒక్కర్ని కూడా విచారణకు పిలవలేదు.

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డిపై అత్యంత దారుణంగా, సభ్య సమాజం తలదించుకునే రీతిలో విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఐడీకి కనిపించట్లేదా? అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులను అసభ్యపదజాలంతో దూషిస్తూ మార్ఫింగ్‌ చిత్రాలతో ప్రచారం చేసిన వైసీపీ నాయకులను సీఐడీ ఎందుకు పట్టుకోదు? వారిని ఎందుకు విచారించదు? తెలుగు మహిళలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధను అసభ్యకరంగా దూషిస్తూ వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై సీఐడీ ఎందుకు చర్యలు తీసుకోదు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా.. విజయవాడలోని బెంజిసర్కిల్‌ సహా పలు కూడళ్లల్లో ఆ పోస్టులకు సంబంధించిన పోస్టర్లు గోడకు అతికించినా ఎందుకు చర్యలు లేవు? చంద్రబాబు, అచ్చెన్నాయుడు సంతకాల్ని ఫోర్జరీ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎందుకు కేసు నమోదు చేయదు? తెలుగుదేశం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా, చంపేస్తామని హెచ్చరించేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డీజీపీకార్యాలయంలో ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై హేయమైన, నీచమైన వ్యాఖ్యలు పోస్టు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు ఒక్కరంటే ఒక్కరైనా.. ఈ నాలుగేళ్లలో సీఐడీకి కనిపించలేదా?

హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టే స్వయంగా ఆదేశించినా సీఐడీ ఉదాసీనంగా వ్యవహరించింది. 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదిస్తే ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే.. కేసులు ఎందుకు నమోదు చేశారు? న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదని.. హైకోర్టే నిలదీసింది. సీఐడీ వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందనటానికి, ఏకపక్షంగా.. ఆ పార్టీ ప్రయోజనాల పరిరక్షణకు పనిచేస్తోందనటానికి ఇంతకంటే రుజువులు ఏముంటాయి? దీన్ని బట్టి సీఐడీ ఎంత పక్షపాత ధోరణితో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details