Mulayam Daughter in law joins BJP: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Aparna Yadav joins BJP
అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడిన అపర్ణ.. భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్నింటికన్నా దేశమే ముందు అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును తాను అమితంగా ఇష్టపడతానని వెల్లడించారు.
ప్రధాని మోదీ పనితీరు చూసి భాజపా పట్ల ఆకర్షితురాలినయ్యాను. దేశం ముందు అనేది నా ఆలోచనా విధానం కూడా. దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నాకు అందరి సహకారం కావాలి. నా శక్తి మేరకు ఏం చేయాలో అది చేస్తాను.
-అపర్ణా యాదవ్
ఈ ఎన్నికల్లో అపర్ణను పోటీలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయని భాజపా వర్గాలు తెలిపాయి. ఏ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారనే విషయం త్వరలో తేలనుంది.
UP Election 2022
ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్‌ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఇటీవలి కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. రామమందిరం నిర్మాణానికి 11లక్షల విరాళం అందజేశారు. యోగీ సర్కార్ ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది.