AP intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ తొలి ఏడాది 4.33 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 3.79 లక్షల మంది పరీక్షలు రాయగా... 72 శాతం మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాలు విడుదల..మొదటి స్థానంలో కృష్ణా.. ఆఖరి స్థానంలో విజయనగరం - రిజల్డ్ చెక్
18:49 April 26
ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
మొదట స్థానం కృష్ణా జిల్లా: ప్రథమ, ద్వితీయ ఇంటర్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్ధులు మొదట స్థానం పొందారు. ఫస్ట్ ఇంటర్‌లో పశ్చిమగోదావరి, గుంటూరు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉండగా... ద్వితీయ ఇంటర్‌లో గుంటూరు, పశ్చిమగోదావరి రెండు, మూడు స్థానాలు పొందాయి. వృత్తి విద్యా కోర్సుల్లో ఫస్ట్ ఇంటర్‌లో 49 శాతం, సెకండ్ ఇంటర్‌లో 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే ఆరో తేదీ వరకు నిర్ణీత రుసుం చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చన్నారు. పరీక్షలు తప్పిన, ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్షలు రాయాలనుకునే వారి కోసం మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జిల్లా కేంద్రాల్లోనే జరుపుతామన్నారు. పరీక్ష రుసుము మే మూడో తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సారి ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా... విజయనగరం జిల్లా ఆఖరి స్థానంలో నిలిచినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఈ సారి సైతం ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు బొత్స వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ ఫలితాలు www.eenadu.netలో చూసుకోవచ్చు.
సీఎం, విద్యాశాఖ మంత్రుల జిల్లాలు వెనుకంజ... ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మెుదటి స్థానం దక్కించుకోగా... సీఎం స్వంత జిల్లా వైఎస్ఆర్ కడప మాత్రం.. 46 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మెుదటి స్థానం.. 57 శాతం ఉత్తీర్ణతతో విద్యాశాఖ మంత్రి స్వంత జిల్లా విజయనగరం ఆఖరి స్థానంలో నిలిచింది. విజయనగరం వెనుకబడటానికి కారణాలను సమీక్షిస్తామని బొత్స తెలిపారు. లోపాలు సరిచేసుకుని విజయనగరం జిల్లా పుంజుకునేలా చేస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి: