AP High Court Hearing on Inner Ring Road Case: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుపై హైకోర్టులో వాదనలు.. తదుపరి విచారణ అక్టోబరు 3కు వాయిదా AP High Court Hearing on Inner Ring Road Case:ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో హైకోర్టులో శుక్రవారం కూడా వాదనలు కొనసాగాయి. పిటిషనర్ చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌కు చెందిన ఇంటికి చెల్లించిన అద్దె సొమ్మునూ దర్యాప్తు సంస్థ వివాదం చేయడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. సొమ్ము చెల్లింపు విషయంలో దర్యాప్తు అధికారికి సందేహం ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకొని ఉండాల్సిందని.. ఆ సొమ్ము విషయమై చంద్రబాబును అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పారు.
2017 జులై నుంచి చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటున్నారని.. అద్దె కింద 2019 జూన్‌లో 27లక్షల రూపాయలు లింగమనేనికి పిటిషనర్ సతీమణి చెల్లించారని చెప్పారు. లింగమనేని రమేశ్ ఐటీ రిటర్న్స్‌లో ఆ సొమ్ము గురించి ప్రస్తావించకపోతే.. దాంతో పిటిషనర్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచకుండా న్యాయస్థానాన్ని సీఐడీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
TDP Pattabhiram Comments on Inner Ring Road వైసీపీ నేతలకు ఇన్నర్ రింగ్ రోడ్డు, బైపాస్కు తేడా తెలియదు : టీడీపీ నేత పట్టాభి
2014 మార్చిలోనే భూములు కొందన్న న్యాయవాదులు.. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారని కూడా స్పష్టత లేదన్నారు. కొన్న భూములూ రింగ్‌రోడ్డుకు 4 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయని.. సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం రాజధాని ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై సంబంధిత వ్యక్తులు, అధికారులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉందని కోర్టుకు నివేదించారు.
ఈ విషయాన్ని ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి స్పష్టం చేశారని తెలిపారు. ఓ కేసులో వ్యక్తి అరెస్టయితే మిగతా కేసుల్లోనూ అరెస్టు అయినట్లు భావించాల్సి ఉంటుందని ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. సింగిల్‌జడ్జి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రస్తుత కోర్టు వెళ్లాలనుకుంటే ఈ విషయాన్ని డివిజన్ బెంచ్‌కు నివేదించాలని.. ప్రతి కేసులోనూ అరెస్టు చేయాలనే ప్రామాణికం చట్ట నిబంధనల్లో లేదని తెలిపారు.
TDP PowerPoint Presentation on Inner Ring Road ఇన్నర్ రింగ్‌రోడ్డ్ ప్రాజెక్టు-వాస్తవాలపై టీడీపీ.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్.. వేయని రోడ్డుతో లబ్ది ఎలా?
అంతకు ముందు సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘‘నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారని.. రింగ్‌రోడ్డు కేసులో అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదని చెప్పారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ పెండింగ్‌లో ఉందన్న ఏజీ.. స్కిల్ కేసులో పిటిషనర్ అరెస్టయ్యి ఇప్పటికే 15 రోజులు దాటిందన్నారు.
రింగ్‌రోడ్డు కేసులో అరెస్టయినట్లు భావిస్తే పోలీసు కస్టడీ కోరే హక్కు సీఐడీకి లేకుండా పోతుందని వాదించారు. లింగమనేని రమేశ్ ఇంటికి అద్దెను రెండేళ్ల తర్వాత ఎందుకు చెల్లించారో చంద్రబాబును అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని.. అందువల్ల బెయిలు పిటిషన్ కొట్టేయాలని కోరారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణను అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి ప్రకటించారు.
Arguments in AP High Court on Inner Ring Road: హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వాదనలు.. "ఆ ప్రాజెక్ట్ కేవలం కాగితాలకే పరిమితమైంది"