AP High Court Hearing on Chandrababu Quash Petition:గవర్నర్ అనుమతి లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయడం.. దర్యాప్తు నిర్వహించడం, అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడం వంటివి చెల్లవని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తప్పనిసరి అని అన్నారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు. నిధుల దుర్వినియోగమయ్యాయని అనేందుకు ఆధారాలు లేవని అన్నారు. పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ఏసీపీ కోర్టు జారీచేసిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. మంగళవారం జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు ఈ నెల 10న జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు హాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం ఉదయం 12 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహాయించి.. సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆన్‌లైన్ ద్వారా మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఆన్‌లైన్ ద్వారా, మరో సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నేరుగా వాదనలు వినిపించారు.
అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదని.. పిటిషనర్ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 2018 జులై 26 నుంచి సెక్షన్ 17A అమల్లో ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో 2021 డిసెంబర్ 9న కేసు నమోదు చేశారని గుర్తుచేశారు.
టీడీపీ అధినేతను 2023 సెప్టెంబర్ 8న నిందితుడిగా చేర్చారన్నారు. 17ఏ నిబంధన ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి పొందకుండానే నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారన్నారు. ఈ విషయాన్ని అనిశా కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. నేర ఘటన 2018కి పూర్వం చోటు చేసుకున్నందున సెక్షన్ 17ఏ పాటించాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదన సరికాదన్నారు. 17ఏ అమల్లోకి వచ్చాక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (సి) (డి) ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌పై కేసు నమోదు చేయాలన్నా.. దర్యాప్తు చేయాలన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని గుర్తుచేశారు.
ఓ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మరో ప్రభుత్వం వారిపై కక్ష సాధింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించేందుకు సెక్షన్ 17Aని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో గవర్నర్ అనుమతి లేకుండా దర్యాప్తు నిర్వహించడం, ఎఫ్‌ఐఆర్ నమోదుపై నిషేధం ఉందన్నారు. సెక్షన్ 17Aని సీఐడీ అనుసరించి తీరాల్సిందేనన్నారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా
కక్ష సాధింపులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో సైతం ప్రాథమిక ఆధారాలు లేవన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిధుల మళ్లింపు ప్రస్తావనే రాదని తెలిపారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేతపై ప్రస్తుత ప్రభుత్వం ప్రతీకారం తీసుకునేందుకు కేసు నమోదు చేసిందన్నారు. పిటిషనర్ దేశం విడిచి వెళ్లేవారేమీ కాదన్నారు. నిజంగా దేశం విడిచి వెళ్లేటట్లయితే ప్రాసిక్యూషన్ ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. పిటిషనర్ అడ్డంకిగా లేకుండా ఉండాలనేది ప్రభుత్వ అంతిమ ఉద్దేశమన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు ఆయనను ఈ కేసులో ఇరికించారని వాదించారు.
నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు గురించి సీమెన్స్, డిజైన్‌టెక్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద జరిగిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుకయ్యే ఖర్చులో తొంబై శాతం ఈ రెండు సంస్థలు, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. 90శాతం కింద ప్రాజెక్టుకు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమకూర్చడంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. 90శాతాన్ని సొమ్ము రూపేణా ఇవ్వాలని ఒప్పందంలో లేదన్నారు. 10శాతం మాత్రం ప్రభుత్వం సొమ్ము రూపంలో ఇవ్వాల్సి ఉందన్నారు.
Chandrababu Bail petition in ACB court: చంద్రబాబుకు బెయిల్‌పై ఏసీబీ కోర్టులో పిటిషన్.. రేపు విచారణ
ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ మదింపు చేసిందన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వం తన వాటాగా 10శాతం సొమ్మును విడుదల చేసిందని.. ప్రాజెక్టులో భాగంగా 6 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, 36 టెక్నికల్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆయా కేంద్రాలను డిజైన్‌టెక్ సంస్థ వివిధ కళాశాలలకు అప్పగించిందన్నారు. ఆయా కేంద్రాలను పూర్తిస్థాయిలో అమలు చేశారని, వాటి పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ 2021లో ధ్రువపత్రం జారీచేసినట్లు కోర్టుకు నివేదించారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారని అవి కళ్లముందు కనబడుతున్నాయని తెలిపారు. వాటి ద్వారా 2 లక్షల 13 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు వివరించారు. విడతల వారీగా నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు జారీచేశారని ఆడిట్ జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించారని.. అలాంటప్పుడు నిధుల మళ్లింపు ప్రస్తావనే రాదని చెప్పారు. టెక్నాలజీ భాగస్వాములు సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90శాతం నిధులు తీసుకురాలేదనడం అర్థరహితమని నేర విచారణ ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు.
డిజైన్‌టెక్ సంస్థకు వస్తు సామగ్రి సమకూర్చిన స్కిల్లర్ సంస్థ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిందనే కారణంతో ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించడం, పిటిషనర్‌ను బాధ్యుడ్ని చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. షెల్ కంపెనీలకు నిధుల మళ్లించినట్లు ఆరోపించడం మూర్ఖత్వంతో కూడుకుందని తెలిపారు. నకిలీ ఇన్వాయిస్‌ల విషయం ఆయా సంస్థల అంతర్గత వ్యవహారమని.. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్టు కాదన్నారు. టెక్నాలజీ ప్రొవైడర్లు సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తాయన్నారు.