AP High Court Dismissed Chandrababu Quash Petition: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్.. దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
భజన్‌లాల్ కేసు మొదలు నిహారిక ఇన్‌ఫ్రా కేసు వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే.. సీఆర్‌పీసీ సెక్షన్ 482 ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసుకు సంబంధించిన వాస్తవాల విషయంలో ఇరువైపుల సీనియర్ న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై సెక్షన్ 482 కింద హైకోర్టు మినీ ట్రైల్ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. అదే విధంగా కేసు 2021 డిసెంబరు 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించిందని గుర్తుచేసింది.
Chandrababu Judicial Remand Extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగింపు
నిధుల దుర్వినియోగం వ్యవహారం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని పేర్కొంది. దర్యాప్తు చివరి దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్‌ఐఆర్‌లోను, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు ఈనెల 10వ తేదీన జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.