AP High Court Comments on Chandrababu Bail Petition:స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్ట్.. స్కిల్ కేసు విషయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
High Court Key Comments on Skill Developments Case:నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని..హైకోర్టు తీర్పులో పేర్కొంది. చంద్రబాబు, తెలుగుదేశం ఖాతాకు నిధుల మళ్లింపుపై ఆధారాలు లేవన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో అంగీకరిస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు. ప్రతి ఉపగుత్తేదారు తప్పులకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని.. హైకోర్టు పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ మొదలయ్యాక.. 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారన్న హైకోర్టు.. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని గుర్తు చేసింది. విచారణ కాలంలో కేసును చంద్రబాబు ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారమూ లేదని చెప్పింది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ (NSG) భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశం గానీ, విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు సాధారణ బెయిల్
High Court on Suman Bose signature Argument: సీమెన్స్‌తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలపై హైకోర్ట్ స్పందించింది. సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ విభాగం తేలుస్తుందని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాల్లేవని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతోపాటు ఐటీ శాఖ విచారణలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందన్న వాదనలకు ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.