AP CM Jagan will Visit KCR on 4th January 2023 : ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం కలవనున్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్న జగన్(CM Jagan), అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం ఆయనను పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలోనే కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు :ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కాలు జారి పడిపోయిన కేసీఆర్‌ను ఇటీవలయశోద ఆసుపత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సహా పలువురు పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 10 నిమిషాలు ఆసుపత్రిలో గడిపిన చంద్రబాబు, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Ex CM KCR Surgery at Yashoda Hospital : కేసీఆర్‌కు గాయం అయి ఆసుపత్రిలో చేరడంపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ బాగుండాలని ఆకాంక్షించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యంపై అనుక్షణం రివ్యూ ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎంను కలిసి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కేసీఆర్ క్షేమంగా రావాలని వేడుకున్నారు.