తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2023, 8:14 AM IST

ETV Bharat / bharat

Margadarsi Chit Fund: మరోమారు మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ను విచారించిన సీఐడి.!

CID on Margadarsi Chit Fund: మార్గదర్శి సంస్థలో మరోమారు విచారణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ హడావుడి చేసింది. చిట్‌ఫండ్‌ సంస్థపై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరిట ఇప్పటికే సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను ఒకసారి విచారించిన సీఐడీ... హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దార్, హర్షవర్ధన్‌రాజు, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగింది.

Margadarsi Chit Fund
Margadarsi Chit Fund

సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను సుమారు 7 గంటలపాటు విచారించిన సీఐడీ

AP CID Interrogated Sailaja Kiran: మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్‌ఫండ్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ.. మరోమారు విచారణ పేరుతో హడావుడి చేసింది. సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను మంగళవారం సుమారు 7 గంటలపాటు విచారించింది. వేధింపులే లక్ష్యంగా సీఐడీ అధికారుల తీరు ఉన్నట్లు కనిపించింది. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం.. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించడం వారి దురుద్దేశాన్ని వెల్లడించింది. తొలుత విచారణ నిమిత్తం 40 ప్రశ్నలు అడుగుతామని చెప్పినా.. అధికారులు రోజంతా కేవలం 8 ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. పలుమార్లు అవే ప్రశ్నలతో తికమక పెట్టే ప్రయత్నం చేసినా... శైలజాకిరణ్‌ నింపాదిగా సమాధానాలు చెప్పారు.

Margadarsi మార్గదర్శిలో ఆడిటింగ్‌పై తెలంగాణ హైకోర్టు స్టే..

మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... ఈ క్రమంలో చిట్‌ఫండ్‌కు చెందిన 793.5 కోట్ల విలువైన సొమ్మును ఎటాచ్‌ చేసేందుకు ఇటీవలే జీవో జారీ చేసింది. చందాదారుల్లో సంస్థపై నమ్మకం ఇసుమంత కూడా సడలకపోవడంతో... మరోసారి విచారణ పేరుతో పన్నాగానికి తెరలేపింది. చిట్‌ఫండ్‌ సంస్థపై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరిట ఇప్పటికే సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను ఒకసారి విచారించిన సీఐడీ... హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

ఏపీ సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దార్, హర్షవర్ధన్‌రాజు, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్‌ నేతృత్వంలో... 20 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆమె నివాసానికి చేరుకుంది. సీఐడీ అధికారులు తమ వెంట డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ - డీఆర్ఐ అధికారులనూ తీసుకొచ్చారు. లోపలికి రాగానే ఈ విషయాన్ని గుర్తించిన మార్గదర్శి సిబ్బంది... దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ కేసుతో డీఆర్ఐ అధికారులకు ఏం సంబంధం ఉందని నిలదీశారు. తమ దర్యాప్తునలో సహకారం కోసమే డీఆర్ఐ అధికారులను తీసుకొచ్చామని సీఐడీ అధికారులు వెల్లడించారు. తర్జనభర్జన తర్వాత సీఐడీ అధికారుల అభ్యర్థనను మార్గదర్శి సిబ్బంది అంగీకరించారు. సాయంత్రం దాదాపు 5 గంటల 45 నిమిషాల వరకూ విచారణ కొనసాగింది.

సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకూ శైలజాకిరణ్‌ స్పష్టమైన సమాధానాలిచ్చారు. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని దాదాపు 3 గంటలపాటు సీఐడీ నమోదు చేసింది. 8 గంటల 45 నిమిషాల సమయంలో సీఐడీ బృందం వెనుదిరిగింది. విచారణ తర్వాత శైలజాకిరణ్‌ నివాసం బయట సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు. విచారణకు మార్గదర్శి ఎండీ పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు.

Margadarsi: సీఐడీ అధికారుల తీరుతో.. మార్గదర్శి ఖాతాదారుల ఇబ్బందులు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ విచారణపై సాక్షి మీడియా మంగళవారం ఉదయం నుంచి రాత్రి విషం చిమ్ముతూనే ఉంది. సీఐడీ విచారణతో నిమిత్తం లేకుండా దుష్ప్రచారం చేసింది. చిట్‌ఫండ్‌ వ్యాపారంపై కనీస అవగాహన లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేసింది. పత్రికా ప్రమాణాలు, విలువలు అంటే ఏమాత్రం సరిపడని సాక్షి... ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ చందాదారుల నగదు దారిమళ్లింపుపై విచారణ’ అంటూ నిరాధార ఆరోపణలు చేసింది. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ అంటూ కట్టుకథలు అల్లింది.

నిధుల మళ్లింపు అంశమే సీఐడీ విచారణలో ప్రస్తావనకు రాకున్నా... రామోజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు సీఐడీ గుర్తించిందని అసత్య ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా... 793 కోట్ల ఆస్తుల్ని సీఐడీ ఎటాచ్‌ చేసింది.., మిగిలిన నగదు అంతా ఎక్కడ దాచారు.., ఏయే కంపెనీలకు దారి మళ్లించారంటూ విచారిస్తున్నారని అడ్డగోలుతనం ప్రదర్శించింది. విదేశీ పెట్టుబడుల నేపథ్యంలోనూ శైలజాకిరణ్‌ను ప్రశ్నిస్తున్నట్లు ప్రసారం చేసి దుర్బుద్ధిని బయటపెట్టుకుంది.

EX MP Harshakumar: 'మార్గదర్శి వల్ల అందరికీ మంచే జరిగింది.. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి'

60 ఏళ్లకు పైగా పటిష్ఠ ఆర్థిక భద్రతతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ... నేడు చందాదారులకు డబ్బు చెల్లింపులు చేసే స్థితిలో లేదని సాక్షి మీడియా అన్యాయమైన, అసత్య ఆరోపణలు గుప్పించింది. చందాదారుల నుంచి వసూలు చేసిన వాయిదాలను చిట్‌ పాడుకున్న చందాదారులకు క్రమం తప్పకుండా చెల్లించడంలో మార్గదర్శిది తిరుగులేని ఆర్థిక క్రమశిక్షణ అనే విషయాన్ని కావాలనే విస్మరించింది. చందాదారులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా సాక్షి మీడియా విషం కక్కింది.

శైలజాకిరణ్‌ పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారు, అన్ని ప్రశ్నలకూ సంతృప్తికర సమాధానాలిచ్చారని విచారణ తర్వాత దర్యాప్తు అధికారి రవికుమార్‌ స్వయంగా మీడియాకు వెల్లడించినా... శైలజాకిరణ్‌ సీఐడీ అధికారులకు సహకరించనట్లుగా తెలుస్తోంది అంటూ అసత్య ప్రచారం చేసింది. ఉదయం పదిన్నర నుంచి దాదాపు 5 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అంటూ... వాస్తవ విరుద్ధ అంశాలతో సాక్షి మీడియా యథావిధిగా రెచ్చిపోయింది. ఒకవైపు ఎండీ శైలజాకిరణ్‌ స్టేట్‌మెంటును నమోదుచేస్తూ ఉంటే... ఆమె నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సాక్షి మీడియా బరితెగించి దుష్ప్రచారానికి ఒడిగట్టింది.

ABOUT THE AUTHOR

...view details