తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్గదర్శి ఎండీపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌.. సస్పెండ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు - లుక్ అవుట్ సర్కులర్​

Margadarshi : ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో.. మార్గదర్శి ఎండీ శైలజపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 3న శైలజ.. హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని స్పష్టం చేసింది. కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ లుక్ అవుట్ సర్క్యులర్​ (LOC) జారీ చేయడాన్ని.. న్యాయస్థానం తప్పుపట్టింది. దేశం విడిచి వెళ్లవద్దని మార్గదర్శి ఎండీపై ఎలాంటి నిషేధాజ్ఞలు, ఆదేశాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది

Margadarshi
Margadarshi

By

Published : Jun 2, 2023, 10:55 PM IST

Margadarshi: మార్గదర్శి ఎండీ సీహెచ్ శైలజపై. ఏపీ సీఐడీ జారీ చేసిన.. లుక్ అవుట్ సర్క్యులర్‌ను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ మార్గదర్శి ఎండీ వేసిన పిటిషన్‌పై.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్.. మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఏపీ సీఐడీ కేసుల్లో మార్గదర్శి ఎండీపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ.. మార్చి 21న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం అధికార దుర్వనియోగమేనని శైలజ తరఫున..సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్,.. విమల్ వర్మ వాసిరెడ్డి వాదించారు.

మార్గదర్శి ఎండీపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌.. సస్పెండ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద పిటిషనర్‌కు ఉన్న హక్కుల్ని ఉల్లఘించడమేనన్నారు. ఏప్రిల్ 6న సీఐడీ అధికారులు.. మార్గదర్శి ఎండీ వాంగ్మూలం తీసుకున్నారని, 13న మళ్లీ విచారణ జరుపుతామని చెప్పి.. సీఐడీ అధికారులే వాయిదా వేశారన్నారు. 3,నాలుగు వారాలపాటు.. కుటుంబ కార్యక్రమాలు ఉన్నందున ఏప్రిల్ 27కు ముందు లేదా మే 22 తర్వాత విచారణకు సిద్ధమని ఏప్రిల్ 23న మెయిల్ ద్వారా.. మార్గదర్శి ఎండీ వర్తమానం పంపారని, ఏప్రిల్ 28న అమెరికా వెళ్లారని.. హైకోర్టుకు వివరించారు. జూన్ 5 తర్వాత విచారణ జరపాలని మార్గదర్శి ఎండీ కోరగా.. జూన్ 6న నివాసంలో విచారణ జరుపుతామని సీఐడీ నోటీసు ఇచ్చిందని... న్యాయవాదులు తెలిపారు. ఆ మేరకు మార్గదర్శి ఎండీ సంసిద్ధత కూడా వ్యక్తం చేశారన్నారు.

హైకోర్ట్‌ మధ్యంతర ఉత్తర్వుల మేరకు లుక్‌ అవుట్ నోటీసులు ఉపసంహరించాలని మార్గదర్శి ఎండీ శైలజ ఈమెయిల్ ద్వారా కోరారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జూన్ 6న సీఐడీ విచారణ కోసం ఈనెల 3న హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు మార్గదర్శి ఎండీ శైలజ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని.. హైకోర్టుకు నివేదించారు. అయితే మార్గదర్శి ఎండీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు.. గతంలో ఏపీ ప్రభుత్వం, సీఐడీ వీలైనన్ని చర్యలు చేసినందున.. విమానాశ్రయంలో ఆటంకాలు సృష్టించి ఆ ఫొటోలు, దృశ్యాలను మీడియాకు లీకులిచ్చి... మార్గదర్శి ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతీసే ప్రమాదం ఉందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు.

margadarshi : మార్గదర్శిపై చర్చకు సిద్ధం.. వేదిక ఎక్కడైనా సరే..! ఉండవల్లికి టీడీపీ సవాల్

ఈ సందర్భంగా... కార్తీ పి.చిదంబరం వర్సెస్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ లో మద్రాస్ హైకోర్టు తీర్పును.. ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ లిఖిత పూర్వక వివరణను.. ఏపీ న్యాయవాది సమర్పించారు. పిటిషనర్ తమకు సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లారని సీఐడీ వాదించింది. రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ.. కుటుంబ కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారన్నారు. అందుకే ఈనెల 17న లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఏపీ సీఐడీ తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఎండీ వాదనలతో ఏకీభవించింది. మార్గదర్శి ఎండీ శైలజ దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు గానీ, ఇతర అధికారిక సంస్థలు గానీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని గుర్తు చేసింది. పిటిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వలున్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

Margadarshi Chit Fund case మార్గదర్శి రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు: తెలంగాణ హైకోర్టు

సుమీర్ లింగ్ సల్కాన్ వర్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ కేసులో. దిల్లీ హైకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర హోంశాఖ 2021 ఫిబ్రవరి 2న లుక్‌ అవుట్ నోటీసుల జారీపై మార్గదర్శకాలు ఇచ్చిందని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆ మార్గదర్శకాల ప్రకారం కూడా.. లుక్ అవుట్ సర్క్యులర్ ఇవ్వడం కఠిన చర్యేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషనర్​పై కఠిన చర్యలు తీసుకోవద్దని మార్చి 21న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏపీ సీఐడీ మే 17న లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిందని.. హైకోర్టు పేర్కొంది. కాబట్టి మార్గదర్శి ఎండీపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు వివరించింది.

ABOUT THE AUTHOR

...view details