Thota Chandrasekhar on Vizag Steel Plant Issue : భారత్ రాష్ట్ర సమితి దెబ్బకే విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం దిగివచ్చిందని.. ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తొలి విజయంగా పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేశాయని విమర్శించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకుందామని వివరించారు. ఏపీ ప్రజల తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ప్రజలకు అండగా నిలిచేది భారత్ రాష్ట్ర సమితి మాత్రమేనని ఈ సంఘటనతో రుజువైందని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. జాతి సంపదను కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మొండి వైఖరితో ప్రైవేటీకరణ చేసినా.. మళ్లీ దాన్ని కాపాడుకొని జాతీయం చేస్తానని.. కేసీఆర్ ప్రకటించారని వివరించారు. అదానీకి బైలడిల్లా గనులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెంటనే గనులు కేటాయించాలని తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మంత్రి హరీశ్‌రావు అన్ని నిజాలే మాట్లాడారని అన్నారు. త్వరలోనే విశాఖపట్నంలో బీఆర్‌ఎస్ తరపున భారీ బహిరంగ సభ ఉంటుందని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.
"కేంద్రమంత్రి ఫగ్గన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేందుకు కేసీఆర్ చాలా కృషి చేశారు. ఆంధ్రా పార్టీలు స్టీల్‌ప్లాంట్ కోసం పోరాడలేదు. కేసీఆర్ మెుదటి నుంచి ప్రైవేటీకరణపై పోరాడుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొంటామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్ తరఫున హెచ్చరించాం. ప్రైవేటీకరణపై ముందుకెళ్లట్లేదన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. అదానీకి విశాఖ స్టీల్‌ప్లాంట్ వెళ్లడాన్ని అంగీకరించం." -తోట చంద్రశేఖర్, ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు