తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే భారత్-చైనా ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీని ప్రకారం.. ఇరు దేశాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల భారత్ ఏమీ నష్టపోలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై రాజ్యసభలో ఈమేరకు ప్రకటన చేశారు రాజ్‌నాథ్.
లద్దాఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడం, పెట్రోలింగ్ వంటి సమస్యలున్నాయని తెలిపారు. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయన్న ఆయన.. భారత బలగాలు ఫింగర్ 3 వద్ద ఉంటాయని పేర్కొన్నారు.
జవాన్లు దేనికైనా రెడీ
భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మన భద్రతా దళాలు రుజువు చేశాయన్నారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు.