Anurag Thakur On Wrestlers : భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్‌భూషణ్.. తమను లైంగికంగా వేధించారని ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామం జరిగింది. రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
కాగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. అతడిని అరెస్టు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. "రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని మంగళవారం అర్థరాత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. చర్చల కోసం తాను మరోసారి రెజ్లర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.
రెజ్లర్లకు మద్దతును ఉపసహరించుకోలేదు: టికాయత్
Wrestlers Protest Update : రెజ్లర్లకు తమ మద్దతును ఉపసహరించుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ వెల్లడించారు. డబ్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జూన్ 9న నిర్వహించతలపెట్టిన ప్రదర్శనను కేవలం వాయిదా మాత్రమే వేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెజ్లర్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమిత్ షాతో రెజ్లర్లు భేటీ అయిన తరువాత రైతు సంఘాల నేతలు.. మల్లయోధులకు మద్దతు ఉపసహరించుకున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే టికాయత్ దీనిపై స్పష్టత ఇచ్చారు. "జూన్ 9న దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనను ప్రస్తుతానికి వాయిదా వేశాం. ప్రభుత్వానికి, రెజ్లర్లకు మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో.. కేంద్రం నుంచి వచ్చే స్పందన కోసం వేచిచూస్తున్నాం. మేము రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నాం. కొనసాగిస్తాం." అని టికాయత్ అన్నారు. ప్రభుత్వంతో రెజ్లర్ల తదుపరి సమావేశం గురించి తనకు తెలియదని ఆయన వెల్లడించారు.
Wrestlers meet Amit Shah : మూడు రోజుల క్రితమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రెజ్లర్లు విజ్ఞప్తి చేశారు. జూన్ 4న కేంద్ర మంత్రితో భేటీ అయిన రెజ్లర్లు.. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సత్యవత్ కేదాన్.. అమిత్ షాతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమస్యపై తాను దృష్టిసారిస్తానని అమిత్ షా.. రెజ్లర్లతో హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన రెజ్లర్లతో అన్నారు.