పాడుబడిన ఇంటిని తిరిగి నిర్మిస్తుండగా.. పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు బయటపడ్డాయి. అయితే యజమానికి తెలియకుండా కూలీలు ఆ బంగారాన్ని గుట్టుగా పంచుకున్నారు. కానీ తాగిన మైకంలో ఓ వ్యక్తి నోరుజారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగింది. అదనపు ఎస్పీ దేవేంద్ర పటిదార్ వివరాల ప్రకారం..
ధార్‌లోని ఓ పురాతన ఇంటిని కూల్చి అక్కడ కొత్త ఇంటిని నిర్మించేందుకు యజమాని కొందరు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిలోని కొంతభాగాన్ని కూల్చి శిథిలాలను తరలిస్తుండగా.. ఆ కూలీలకు బంగారంతో కూడిన లోహపు పాత్ర లభించింది. అందులో పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని వారు బయటకు పొక్కనీయలేదు. యజమానికి తెలియకుండా ఆ ఎనిమిది మంది పంచుకున్నారు.