Anti Sleep Glasses For Drivers :చదువంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదు.. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం అని నిరూపించిందో విద్యార్థిని. నిద్రమత్తులో వాహనాలు నడుపుతూ చాలా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి.. దానికి పరిష్కారాన్ని ఆలోచించింది రబియా ఫరూఖీ అనే విద్యార్థిని. ఆలోచనకు ఆచరణ తోడయ్యింది. ఆమె రూపొందించిన ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
రబియా ఫరూఖీ కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బల్లికి చెందిన విద్యార్థిని. విద్యానికేతన్ సైన్స్ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఒకసారి ఊటీకి విహారయాత్రకని వెళ్లింది. అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది కళ్లారా చూసిన రబియా.. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే అని తెలుసుకుంది. దానికి ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించాలని అనుకుంది.
ఆలోచనకు ఆచరణ తోడై..
అనుకుని ఊరుకోలేదు ఆ విద్యార్థిని. తన ఆలోచనకు పదును పెట్టి ఆచరణను జోడించింది. ఒక సెన్సర్, బజర్, బ్యాటరీలతో ఆమె ఈ యాంటీ-స్లీప్ డ్రూనెస్ ప్రివెంటర్ మిషన్ తయారు చేసింది. ప్రాజెక్టు తయారీకి ఆమె ఖర్చు చేసింది రూ.400-రూ.500 మాత్రమే. ఈ నమూనాను ఇన్స్పైర్ విజ్ఞాన ప్రదర్శనలో ఉంచింది రబియా ఫరూఖీ. ఆమె రూపొందించిన ఈ నమూనా.. జిల్లా, రాష్ట్ర, స్థాయిలను దాటి జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ 60 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
"నేను తయారు చేసిన ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం. ఈ యాంటీ-స్లీప్ డ్రూనెస్ పరికరాన్ని మన దేశంలో తయారు చేసే హెల్మెట్లలో అమరిస్తే బాగుంటుంది. ఈ నమూనాను ఇన్స్పైర్ ప్రదర్శనలో ఉంచాలనుకున్నాను. ఈ క్రమంలో జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఆన్లైన్లో ప్రాజెక్టు వివరాలు పంపించాను. ఈ నెల 11 న విజ్ఞాన్ భవన్లో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నా. నేను ప్రాజెక్టు తయారు చేసినందుకుగాను ప్రశంసలు అందుకున్నా. దేశవ్యాప్తంగా మొత్తం 441 ప్రాజెక్టులు వస్తే వాటిలో ఉత్తమ 60 ప్రాజెక్టుల్లో నేను తయారు చేసింది ఉంది."
-రబియా ఫరూఖీ, విద్యార్థి