తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అల్లర్లు జరిగిన ప్రాంతాలకు 'బుల్​డోజర్లు'.. అధికార, విపక్షాల మాటల యుద్ధం

Anti Encroachment Drive Rahul: దిల్లీ జహంగీర్​పురిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల హనుమాన్​ జయంతి సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో.. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టింది ఉత్తర దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​. ఈ కూల్చివేతలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ద్వేషపూరిత బుల్​డోజర్లు ఆపి.. పవర్​ ప్లాంట్లను ఆన్​ చేయండని మండిపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది.

Anti Encroachment drive in Delhi Jahangirpuri.. Rahul Gandhi attacked government
Anti Encroachment drive in Delhi Jahangirpuri.. Rahul Gandhi attacked government

By

Published : Apr 20, 2022, 5:14 PM IST

Updated : Apr 21, 2022, 1:15 AM IST

Anti Encroachment Drive Rahul: అక్రమ నిర్మాణాలపై భాజపా సర్కార్​.. పలు చోట్ల బుల్​డోజర్లను ఉపయోగిస్తుండటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దిల్లీ జహంగీర్​పురి సహా మధ్యప్రదేశ్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ద్వేషపూరిత బుల్​డోజర్లను వెంటనే ఆపివేసి.. పవర్​ ప్లాంట్లను ఆన్​ చేయండని అన్నారు. దేశంలో బొగ్గు కొరత గురించి ప్రస్తావించారు. బుల్​డోజర్లతో మన రాజ్యాంగ విలువలను కూడా భాజపా ధ్వంసం చేస్తోందని రాహుల్​ ట్వీట్​ చేశారు.

రాహుల్​ గాంధీ ట్వీట్​

''ఈ ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా కేవలం 8 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మోదీజీ.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మాంద్యం ముంచుకొస్తోంది. విద్యుత్​ కోతలు చిన్న పరిశ్రమలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇది మరింత నిరుద్యోగానికి దారి తీస్తుంది. అందుకే ద్వేషపూరిత బుల్​డోజర్లను ఆపివేసి.. పవర్​ ప్లాంట్లను ఆన్​ చేయండి.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రాహుల్​ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది. ఆయన దేశ ప్రతిష్ఠను భ్రష్టు పట్టిస్తున్నారని, ద్వేషానికి బీజాలు వేస్తున్నారని ఆరోపించింది. రాహుల్​ దేశానికి మంచి చేసిందేం లేదని, ఇకపైనా చేయలేరని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకుర్​. అంతకుముందు ఆప్​ చేసిన విమర్శలపైనా ఠాకుర్​ స్పందించారు. అధికారం కోసం ఉగ్రవాదులతో రాజీ పడే పార్టీ ఆప్​ అని దుయ్యబట్టారు.

జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు పలువురికి కన్నీళ్లు మిగిల్చింది. బాధితులు లబోదిబోమంటున్నారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం కట్టడాల కూల్చివేత ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ సుప్రీంకోర్టు కలగజేసుకుని.. నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించడంతో కూల్చివేతను ఆపేశారు. అయితే సక్రమ నిర్మాణాలపైనా అధికారులు ప్రతాపం చూపినట్లు తెలుస్తోంది. అన్ని పత్రాలున్నప్పటికీ తన జ్యూస్‌ షాప్‌ను ధ్వంసం చేశారంటూ గణేశ్‌ కుమార్‌ గుప్తా అనే చిరు వ్యాపారి వాపోయారు. 1977లోనే దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ తన దుకాణానికి అనుమతి ఇచ్చిందని, దానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

'నా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదు. కూల్చివేతను ఆపాలని గంట క్రితమే సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పినా పట్టించుకోలేదు. నా కుటుంబంలోని వారెవరూ అల్లర్లకు పాల్పడలేదు. నేనో సాధారణ దుకాణాదారుడిని. నా షాప్‌ను ఎందుకు ధ్వంసం చేయాలి?' అని గణేశ్‌ కుమార్‌ వాపోయారు.

కూల్చివేయొద్దంటూ విలవిల్లాడిన మహిళ..బుల్డోజర్లతో ఓ చిన్నపాటి ఇంటిని కూల్చేస్తుంటే అందులో నివసించే ఓ మహిళ విలవిల్లాడిపోయింది. కూల్చివేయొద్దంటూ అధికారులను బతిమాలింది. అయినప్పటికీ కనికరం చూపని అధికారులు.. చూస్తుండగానే ఆమె సామగ్రిని జేసీబీలతో ఎత్తి ట్రాక్టర్‌లోని మట్టిలో పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది: ఇటీవల హనుమాన్‌ జయంతి శోభాయాత్ర సందర్భంగా జహంగీర్‌పురిలో ఘర్షణలు జరగ్గా.. తాజాగా అక్కడ ఉత్తర దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈ కూల్చివేతలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందే అధికారులు కొన్ని నిర్మాణాలు కూల్చివేయగా, ఆదేశాల కాపీ తమకు అందలేదని ఆ తర్వాత కూడా వాటిని కొనసాగించారు. ఈ అంశాన్ని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా.. తమ ఆదేశాలను ఉత్తర దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, పోలీసు కమిషనర్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఈ ఆదేశాల కాపీ అందిన తర్వాత.. అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు.

ఇవీ చూడండి:జహంగీర్​పురిలో బుల్​డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం స్టే

కూలీ పిల్లలు 'కోటీశ్వరులు'.. ప్రభుత్వ సాయం కోసం తిప్పలు!

Last Updated : Apr 21, 2022, 1:15 AM IST

ABOUT THE AUTHOR

...view details