Anti-conversion bill in Karnataka: బలవంతపు మత మార్పిడిలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లోనే 'కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు-2021' తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 భారతీయ పౌరులు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు హక్కును కల్పిస్తోంది. అయితే, బలవంతపు మార్పిడులను నిషేధిస్తోంది. ఈ నిబంధనకు లోబడి.. బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించనుంది కర్ణాటక ప్రభుత్వం.
కొత్త బిల్ ఏం చెబుతోంది?
కొత్త బిల్లు ప్రభారం బలవంతంగా, బెదిరించి మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గంలోని మహిళలు, మైనర్లు, బధిరులను మతమార్పిడి చేస్తే కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇతర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను ఇతర మతంలోకి మారేలా ప్రేరేపిస్తే.. గరిష్టంగా 5 ఏళ్ల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు. సామూహిక మత మార్పిడిలు చేస్తే.. 3-10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో డబ్బులు, బహుమతులు, ఉపాధి, ఉచిత విద్య, వివాహాలు, మంచి జీవన విధానం వంటివి చూపించి ఆకర్షించే ప్రయత్నాలను సైతం నేరంగా పరిగణించనున్నారు. ఇలాంటి వాటిలో పాల్గొనే ఎన్జీఓలు, మతపరమైన మిషినరీస్, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధశరణాలయాలు, విద్యాసంస్థలకు నిధులను నిలిపివేయనున్నారు. బలవంతపు మత మార్పిడి ఏ విధానంగా జరిగినా నాన్బెయిలెబుల్ నేరంగా పరిగణిస్తారు. మతమార్పిడి నిరూపితమైతే.. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు.