Corona new variant: కరోనా మూడోవేవ్ అదుపులోకి రావడంతో.. భారత్ కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ప్రతిసారి కొత్త వేరియంట్లు వెలుగులోకి రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. రానున్న 6-8 నెలల్లో భారత్‌లో మరోవేవ్ రావొచ్చని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ అంచనావేశారు. అలాగే ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ల తీవ్రత గురించి వెల్లడించారు. బీఏ.1 కంటే బీఏ.2కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ.. ఇది మరోవేవ్‌కు దోహదం చేయదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'వైరస్ చాలా కాలం పాటు దశలవారీగా విజృంభిస్తూనే ఉంటుంది. కొత్త వేరియంట్ ఎప్పుడు వస్తే.. అప్పుడే మరో వేవ్ ఉంటుంది. అయితే అది ఎప్పుడో చెప్పలేం. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. అది 6-8 నెలల్లో కావొచ్చు. కానీ, వైరస్ మన చుట్టూనే ఉంటుంది. దానిని కట్టడిచేసేందుకు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే' అని స్పష్టం చేశారు.