ఒడిశా బాలేశ్వర్‌లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్‌లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్ లైన్లోకి ప్రవేశించింది రైలు. లోకోపైలట్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్‌లైన్ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకోపైలట్.. వెంటనే బ్రేకులు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు జరుగుతున్న లైన్లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగ్నలింగ్‌లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది.. రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్ లైనులో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులోకి అలానే వెళ్లుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.
"ట్రాక్‌లో ఏదో సమస్య ఉందని లోకోపైలట్ గమనించారు. వెంటనే బ్రేకులు వేయడం వల్ల రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తర్వాత 300 మీటర్లు రైలును వెనక్కి పోనిచ్చారు. దీంతో ప్రయాణికులంతా భయపడి రైలు దిగారు."
--ప్రయాణికుడు
290 మందికి పైగా మృతి
అంతకుముందు ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోనే మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికిపైగా గాయపడ్డారు. సిగ్నలింగ్ లోపం వల్ల లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న హావ్‌డా-యశ్వంత్‌పూర్ రైలు కూడా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీ కొట్టడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని రైల్వేశాఖ ప్రాథమికంగా నిర్థరించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.
మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్ జిల్లాలో విధులు నిర్వర్తించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి :ఒకే ట్రాక్‌పై ప్యాసింజర్, గూడ్స్.. తప్పిన పెను ప్రమాదం!.. రైల్వేశాఖ క్లారిటీ
చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు హడల్.. 12 నిమిషాల్లోనే..