పంజాబ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ వద్ద వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి ఓ భారీ పేలుడు జరగ్గా.. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. దీంతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించేందకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కాస్త భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
పేలుడు జరిగిన ప్రదేశం వద్ద బాంబ్ స్క్వాడ్ అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీస్ కమిషనన్ నౌనిహాల్ సింగ్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. "పేలుడు ఘటనను ధ్రువీకరిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ స్క్వాడ్, FSL బృందాలు చేరుకున్నాయి. ఒక వ్యక్తి కాలికి చిన్న గాయమైంది" అని ఏడీసీపీ మెహతాబ్ సింగ్ వెల్లడించారు.
ఘటనా సమయంలో అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ స్వీపర్ కూడా మాట్లాడారు. "నేను ఇక్కడ స్వీపర్‌ను. డ్యూటీ చేస్తుండగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. భారీగా పొగలు కమ్ముకున్నాయి" అని తెలిపారు.
పేలుడు జరిగిన ప్రదేశం వద్ద పోలీసులు శనివారం రాత్రి కూడా..
స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఓ పేలుడులో కొందరు బాలికలు సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో స్థానికులకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాబ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
"ఇది బాంబు పేలుడు కాదు. సచ్‌ఖండ్ శ్రీ హర్మందిర్ దర్బార్ సాహిబ్ బయట ఉన్న పార్కింగ్ స్థలంలో భారీ గాజు వస్తువు పేలింది. అలాగే పార్కింగ్ ఏరియా పక్కనే ఓ రెస్టారెంట్ ఉంది. ఆ హోటల్ చిమ్నీ చాలా వేడిగా ఉండడం కారణంగా అందులో గ్యాస్ ఏర్పడి అక్కడే ఉన్న గాజు అద్దం పగిలి పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు."
- పోలీసు అధికారి