తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మళ్లీ మంకీపాక్స్​ అలజడి.. ఆ రాష్ట్రంలో రెండో కేసు! - monkey pox second case

Monkeypox Case In India: దేశంలో మంకీపాక్స్​ అలజడి సృష్టిస్తోంది. తొలి కేసు నమోదైన నాలుగు రోజులకే మరో కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్​ బారిన పడినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు.

another-confirmed-case-of-monkeypox-reported-in-kerala-says-state-health-minister-veena-george
another-confirmed-case-of-monkeypox-reported-in-kerala-says-state-health-minister-veena-george

By

Published : Jul 18, 2022, 4:29 PM IST

Monkeypox Case In Kerala: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌.. భారత్‌కూ తాజాగా విస్తరించింది. నాలుగు రోజుల క్రితమే యూఏఈ నుంచి వ్యక్తికి మంకీపాక్స్​ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు కేరళకు చెందిన మరో వ్యక్తి మంకీపాక్స్​ బారినపడినట్లు సోమవారం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్​ అధికారికంగా ధ్రువీకరించారు. తొలుత అనుమానిత కేసుగా గుర్తించామని, వైద్యపరీక్షల అనంతరం మంకీపాక్స్‌గా నిర్ధరణ అయిందని చెప్పారు.

"కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి.. జులై 13న దుబాయ్​ నుంచి కర్ణాటక మంగుళూరు విమానాశ్రయానికి వచ్చాడు. ప్రాధమిక పరీక్షల్లో అతడిలో మంకీపాక్స్​ లక్షణాలు కనిపించగా.. శాంపిల్స్​ను పుణె వైరాలజీ ఇన్​స్టిట్యూట్​కు పంపాం. సోమవారం అతడికి మంకీపాక్స్​ సోకినట్లుగా తేలింది. ప్రస్తుతం అతడు పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది."

-- వీణా జార్జ్​, కేరళ ఆరోగ్యశాఖ మంత్రి

మంకీపాక్స్ గురించి..మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇవే లక్షణాలు..జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

వారిలోనే ఎక్కువ!..ఇదిలాఉంటే, గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్‌ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో నిర్ధారణ కాగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:భారత్​లో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details