Acid attack on married woman: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత మంగళవారం జరిగిన యాసిడ్ దాడి మరవక ముందే.. మరో ఘాతుకం వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిందని వివాహితపై యాసిడ్ పోశాడు ఓ దుండగుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని కుమారస్వామి లేఔట్లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది: కుమారస్వామి లేఔట్‌లోని జేపీ నగరకు చెందిన బాధితురాలికి వివాహం జరగగా.. ఓ కుమార్తె ఉంది. నిందితుడు అహ్మద్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. వివాహం చేసుకోవడానికి తనకు మరికొంత సమయం కావాలని బాధితురాలు చెప్పింది. దీనికి ఒప్పుకోని నిందితుడు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టాడు. ఫలితంగా ఇరువురి మధ్య తీవ్ర వివాదం జరిగింది.
కోపోద్రిక్తుడైన నిందితుడు నడుచుకుంటూ వెళ్తున్న బాధితురాలిని.. సరక్కి సిగ్నల్ వద్ద అడ్డగించి యాసిడ్‌తో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె కుడి కన్ను తీవ్రంగా గాయపడిందని.. ప్రస్తుతం చికిత్స జరగుతోందని తెలిపారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మే 31 న బెంగళూరు కబ్బన్పేటెలో స్నేహితుడిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఒకేచోట పనిచేసే ఇద్దరి మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. దీంతో జనతా ఆదక్ అనే వ్యక్తి.. తన స్నేహితుడిపై యాసిడ్ దాడి చేశాడు. 30 శాతం గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు ఏప్రిల్‌లో ప్రేమకు నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి చేశాడు మరో యువకుడు.
ఇదీ చదవండి:కూతురి మృతదేహంతో 4 రోజులు ఇంట్లోనే తల్లి.. ఏం చేస్తోందంటే?