దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తోన్న రైతులకు మద్దతు తెలిపిన అన్నాహజారే.. రామ్లీలా మైదానంలో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారానికి గత నాలుగేళ్లుగా తాను నిరసనలు చేపడుతోన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ, వ్యవసాయ మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు తప్ప నెరవేర్చట్లేదని విమర్శించారు.
జాతీయ వ్యవసాయ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పిస్తేనే అన్నదాతల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నా హజారే అన్నారు. రాష్ట్రాలు నిర్ణయించే కనీస మద్దతు ధరలో కేంద్రం 20 నుంచి 50 శాతం కోత విధిస్తోందని, ఈ పరిస్థితి మారాలన్నారు. ఇక దిగుబడులు తగ్గిన సమయంలో రైతులకు ఆత్మహత్యే శరణ్యం అవుతోందని, స్వామినాథన్ సిఫార్సులను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.