తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రీవాల్​పై అన్నా హజారే ఫైర్​.. అధికార మత్తులో మునిగిపోయారంటూ.. - దిల్లీ ఎక్సైజ్​ స్కామ్​

Anna Hazare Letter To Arvind Kejriwal: దిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని విమర్శిస్తూ లేఖ రాశారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. కేజ్రీవాల్​ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్​.. అన్నా హజారే భుజాలపై తుపాకీ పెట్టి.. తమపై గురి పెడుతున్నారని విమర్శించారు.

delhi excise policy
delhi excise policy

By

Published : Aug 30, 2022, 5:51 PM IST

Anna Hazare Letter To Arvind Kejriwal: దిల్లీ ఎక్సైజ్​ కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​పై విమర్శలు గుప్పించారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. ఈ మేరకు మంగళవారం కేజ్రీవాల్​కు బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్​ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శించారు. ఎక్సైజ్‌ పాలసీని పరిశీలిస్తే మద్యం అమ్మకాలతో పాటు అవినీతిని ప్రోత్సహించేలా ఉందన్నారు అన్నా హజారే. ప్రజల జీవితాన్ని నాశనం చేయడంతో పాటు మహిళలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదముందని పేర్కొన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంపై వస్తున్న వార్తలను చూస్తుంటే తనకు బాధగా ఉందని చెప్పారు. అందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా లేఖ రాశానని తెలిపారు.

అన్నా హజారే రాసిన లేఖ
అన్నా హజారే రాసిన లేఖ

"ప్రతి వార్డులోను ఆయన ఓ లిక్కర్​ షాపును ప్రారంభించారు. వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21కు తగ్గించి.. మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అందుకే తొలిసారిగా ఆయనకు లేఖ రాశాను. నేను ఉద్యమిస్తున్నపుడు.. ఆయన నన్ను 'గురు' అని పిలిచేవారు. ఆ విషయాలు గుర్తున్నాయా ఇప్పుడు?"

-అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు

స్వరాజ్‌ పుస్తకంలో అనేక ఆదర్శ సూత్రాలను కేజ్రీవాల్‌ ప్రస్తావించారన్న హజారే.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని విమర్శించారు. ఆప్​ కూడా మిగతా పార్టీల దారిలోనే పయనించడం బాధ కలిగించే విషయమన్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సిఫారసు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సహా.. పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేసింది.

హజారే భుజంపై తుపాకీ పెట్టి తమపై గురిపెడుతున్నారు: సామాజిక ఉద్యమాకారుడు అన్నా హజారే చేసిన వ్యాఖ్యలపై స్పందించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. దిల్లీ ఎక్సైజ్​ పాలసీలో కుంభకోణం జరిగిందని భాజపా ఆరోపిస్తుంటే.. సీబీఐ మాత్రం అలాంటిదేమి జరగలేదని చెబుతోందన్నారు​. ప్రజలు వీటిని వినడం లేదని.. అందుకే తాజాగా అన్నా హజారే భుజాలపై తుపాకీ పెట్టి.. తమపై గురి పెడుతున్నారని విమర్శించారు. తాము ప్రజాక్షేత్రంలోకి వచ్చినపుడే.. ఎలాంటి విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే వస్తామన్నారు. సీబీఐ.. మనీశ్​ సిసోదియాను 14 గంటల పాటు విచారించిందని.. వారడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆయన లాకర్​లో ఏం లభించలేదని.. సీబీఐ అనధికారంగా క్లీన్​చిట్​ ఇచ్చిందన్నారు.

ఇవీ చదవండి:దేశానికి ఐదు రాజధానులు అవసరం, సీఎం కీలక ప్రతిపాదన

ఆప్ వర్సెస్ భాజపా, అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా, పోటాపోటీ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details