ఉత్తర్ప్రదేశ్ వారణాసికి చెందిన స్వాతి బలనికి చిన్ననాటి నుంచి మూగజీవాలంటే అంటే ఎనలేని ప్రేమ. వీటి కోసం ఏదైనా చేయాలని అనుకుంది. అందుకే ఎంతో విలాసవంతమైన తన ఇంటిని ఓ 'జూ'గా మార్చేసింది. వ్యాధులతో బాధపడుతోన్న, గాయపడిన జంతువులను తీసుకువచ్చి తన ఇంట్లోనే ఆశ్రయమిస్తోంది స్వాతి. దీంతో అనేక మంది ప్రజలు ఆమెను 'మౌగ్లీ'గా పిలుస్తున్నారు.
ముంబయిలో ఎంబీఏ పూర్తి చేసిన స్వాతి.. అక్కడ కొన్ని రోజులు పని చేసి వారణాసికి వచ్చేసింది. నాటి నుంచి దాదాపు పదేళ్లుగా జంతువులకు సేవ చేస్తోంది. ప్రస్తుతం స్వాతి వద్ద 20 కుక్కలు, 13 పిల్లులు, రెండు ఎద్దులు, 25కు పైగా పావురాలు, 60కి పైగా వివిధ రకాల పక్షులు, గద్ద ఉన్నాయి. సుల్తాన్, లడ్డు, చున్నీ, రాక్సీ, బర్ఫీ, బుల్బుల్, జిమ్మీ, జాకీ, హనీ ఇలా జంతువులన్నింటికీ పేర్లు పెట్టి ఆప్యాయంగా పిలుస్తోంది. తన తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో జంతువులన్నింటి బాగోగులు చూస్తోంది.
"చిన్నప్పటి నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిని ప్రేమించడం నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నా. మా ఇంట్లో అనేక రకాలైన జంతువులను పెంచేవారు. చిన్ననాటి నుంచి వాటి మధ్యే పెరిగాను. రోడ్డుపై గాయపడిన జంతువులను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వాటిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకువస్తా. ఇక్కడ వాతావరణం బాగుండడం వల్ల జంతువులు ఇక్కడే ఉంటున్నాయి."