Growing interest among the youth in 'Karrasamu': ''కర్రసాము' ఆట గురించి పట్టణాల్లో నివసించే నేటి యువతకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, గ్రామాల్లో ఉండే యువతకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే.. ఊర్లల్లో ఇప్పటికీ ఏదైనా ఉత్సవాలు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా కొంతమంది పెద్దవాళ్లు కర్రసాము చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటుంటారు. అటువంటి ఆటను అంతరించిపోకుండా ఉండేందుకు కొంతమంది నిపుణులు పలుచోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, కర్రసాముకు ఉన్న చరిత్ర, ఉపయోగాలు, కర్రసామును ప్రదర్శించే విధానంపై రోజురోజుకు యువతలో ఆసక్తి పెరుగుతుందట. అంతేకాదు, కొంతమంది యువతీ, యువకులు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఎన్నో పతకాలు సాధించి.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారట. మరి ఏంటి ఈ కర్రసాము చరిత్ర..?, ఈ ఆట వల్ల ఉపయోగాలు ఏమిటి..?, యువత కర్రసాము వైపు మొగ్గుచూపడానికి కారణాలెంటి..? తెలుగు రాష్టాల్లో ఏ ప్రాంతంలో ఈ కర్రసాము శిక్షణ ఇస్తున్నారు..? అనే వివరాలు మీకోసం..
కర్రసాము ప్రాచీన కళ..ప్రాచీన యుద్ధ కళలు అంతరించిపోకుండా నేటి, భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంగా పలు చోట్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి చెందిందే కర్రసాము. ఇప్పుడిది 'సిలంబం' పేరుతో ప్రాచుర్యంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాచీన అంశంతో పాటు.. ఆత్మరక్షణకూ.. ఇది అత్యంత అనుకూలమైనది. దీనిని తగిన విధంగా అభ్యసిస్తే మానసిక, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిలంబం అండగా నిలుస్తుంది. ఇప్పుడీ సాధన వైపు అధికశాతం యువత మొగ్గుచూపుతోంది. ఫలితంగా జాతీయ స్థాయుల్లోనూ పతకాలు సాధించి.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
యుద్ధ విద్యలు అంటే.. కరాటే, కుంఫూ, తైక్వాండో వంటివే అనుకుంటాం. కానీ, సిలంబం కూడా అలాంటిదే అని చాలామందికి తెలియదు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా ఉన్న కర్రసాము అనంతరం వెనకబాటుకు గురైంది. కానీ, ఆ ఆట ప్రాముఖ్యత గుర్తించిన కొందరు మహోన్నతులు కర్రసాముకు తిరిగి ప్రాణం పోశారు. క్రమంగా దీని ప్రాముఖ్యత తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ యుద్ధ క్రీడలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు.
కర్రసాము వస్తే.. ఐదారుగురు తోడున్నట్టే.. కర్రసాము ప్రాముఖ్యత కాలక్రమేణా తగ్గినా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. ఐతే, నగర యువతకు కర్రసాము క్రీడపై అవగాహన తక్కువే ఉండేది. ఈ నేపథ్యంలో కర్రసాము ఔనత్యాన్ని యువతకు తెలియపర్చేందుకు సంప్రదాయ కర్రసాము పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆత్మరక్షణకూ సిలంబం ఉపయోపడుతోంది. ఆపద సమయంలో కర్ర చేతిలో ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే అని చెప్పొచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిలంబానికి మార్షల్ ఆర్ట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో ఈ ప్రాచీన యుద్ధ విద్య మళ్లీ ప్రాణం పోసుకుంది.