Andhra Pradesh State Debts Ten Lakh Crores: పది లక్షల 11 వేల 827కోట్లు! ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు చదవడానికే కష్టంగా ఉంది కదా! కానీ మన జగనన్న ప్రభుత్వం పది లక్షల కోట్లకుపైగా అప్పును మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేసింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు 10 లక్షల 21 వేల కోట్లకు చేరింది. గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని అనధికారిక అంచనా. ఆ పెండింగు బిల్లులూ ఓ రకంగా అప్పులాంటివే. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్నా, శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తూ కేంద్ర మంత్రి దిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం లెక్కచేయడంలేదు.
ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే! ఐతే, రాష్ట్ర GSDP (Gross State Domestic Product)లో 35 శాతం మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం.! కానీ ఏపీ అప్పులు జీఎస్డీపీలో 42 శాతం దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులూ కలిపితే రుణాలు అది ఏకంగా 65 శాతం దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మన అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కి పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారులు, అధికారులు అప్పు ఎక్కడ ఎలా పుట్టించవచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనుల్లోనే నిమగ్నమై ఉంటున్నారు.
రికార్డు స్థాయిలో అప్పులు, రాబోయే ప్రభుత్వానికి చుక్కలు కనపడటం ఖాయం!
రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్త: ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు, ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వు బ్యాంకు ద్వారా జాతీయ బ్యాంకుల్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన 18 వందల కోట్ల రూపాయల అప్పును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, FRBM (Fiscal Responsibility and Budget Management) చట్టానికి విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శే స్పష్టంచేశారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ ఆ కార్పొరేషన్ వాటికి హామీలు ఇచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇదీ ఒక తరహా అప్పే. ఇలా చేయడం తప్పని రిజర్వు బ్యాంకు తప్పుపట్టింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 5 వేల కోట్ల రూపాయలను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగుకు ప్రయత్నించింది. ఐతే ఆ ట్రేడింగులో ఎవరూ పాల్గొనవద్దని ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర దుస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్