తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సవాళ్లను అధిగమించి.. అండమాన్‌ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్‌ - full vaccination in india

100 percent vaccination: కరోనా టీకా పంపిణీలో అండమాన్​ నికోబార్​ దీవులు కీలక మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైనవారందరికీ ​రెండు డోసుల కొవిడ్​ టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం కొవిషీల్డ్​ టీకానే అందించి ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు.

100 percent vaccination
100 percent vaccination

By

Published : Dec 19, 2021, 1:16 PM IST

100 percent vaccination: దేశంలో ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటం ఊరటనిచ్చే విషయం. ఈ క్రమంలో అండమాన్​ నికోబార్‌ దీవులు కీలక మైలురాయిని అందుకున్నాయి. అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ అందినట్లు అక్కడి పాలకవర్గం ప్రకటించింది. కేవలం కొవిషీల్డ్‌ టీకా పంపిణీతోనే ఈ ఘనత సాధించిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. ఈ విషయాన్ని అక్కడి పాలకవర్గం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

"అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్​ పూర్తి చేశాం. ఈ ప్రాంతంలో టీకా పంపిణీ అత్యంత సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశాం. దట్టమైన అడవులు, కొండలను సైతం దాటుకొని ప్రతికూల వాతావరణంలోనూ టీకాలు పంపిణీ చేశాం."

- అండమాన్​ నికోబార్​ దీవుల పాలకవర్గం

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లోనూ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మంది టీకాలు అందాయి.

అక్కడ ఆదివారం మరో కరోనా కేసు నమోదు కాగా.. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 7,701కి పెరిగింది. వీరిలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రెండు యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

హిమాచల్​ ప్రదేశ్​లో 100 శాతం

ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌.. అర్హులందరికీ 100శాతం వ్యాక్సిన్‌ ఇచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 53.87 లక్షల మంది అర్హులకు డిసెంబరు 5 నాటికి అందరికీ రెండు డోసుల టీకా అందజేశారు. కాగా.. గోవాలో అర్హులైనవారందరికీ కొవిడ్​ తొలి డోసు టీకా వేసినట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్​ సావంత్​ ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details