తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధం వేళ.. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్న ఆనంద్ మహీంద్రా!

Ukraine Crisis: ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థులను కేంద్రం తరలిస్తోంది. అయితే.. వీరంతా అక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లినవారే. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సరికొత్త ఆలోచన చేశారు. దేశంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. భారత్‌లో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం తనకు తెలియదని తెలిపారు.

Ukraine Crisis
ఆనంద్ మహేంద్ర

By

Published : Mar 3, 2022, 5:31 PM IST

Ukraine Crisis: రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ వేళ.. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సరికొత్త ఆలోచన చేశారు. మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ముమ్మర చర్యలు చేపట్టింది. అయితే వీరంతా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన వారే కావడం గమనార్హం. మెడిసిన్‌ కోసం చైనా తర్వాత భారత విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయిస్తోన్న రెండో దేశం ఉక్రెయిన్‌ అని ఇటీవల పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ కథనాలపై ఆనంద్‌ మహీంద్రా నేడు ట్విటర్‌ వేదికగా స్పందించారు. "భారత్‌లో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం నాకు తెలియదు. మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించొచ్చేమో" అని మహీంద్రా ట్వీట్ చేశారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నారీని ట్యాగ్‌ చేస్తూ మహీంద్రా ఈ ఆలోచన పంచుకున్నారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అయితే కాలేజీ ఏర్పాటు చేస్తే ఫీజులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు నెటిజన్లు మహీంద్రాను అభ్యర్థిస్తున్నారు. "వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లడం వెనుక భారత్‌లో మెడికల్‌ కాలేజీల కొరత ఒక్కటే కారణం కాదు. ఫీజులు కూడా. చాలా మంది ఖర్చు తక్కువని భావించే విదేశాల్లో మెడిసిన్‌ చదువుతున్నారు" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మహీంద్రా యూనివర్శిటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఒకవేళ ఆనంద్ మహీంద్రా ఆలోచనను ఆచరణలో పెడితే త్వరలోనే హైదరాబాద్‌లో మహీంద్రా మెడికల్‌ కాలేజీ ఏర్పాటయ్యే అవకాశముంది.

ఇదీ చదవండి:రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details