దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. 1977 ఎన్నికల్లో మినహా, మరెప్పుడూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. నిజానికి వాటిలో చాలా ప్రభుత్వాలు బాగానే పనిచేశాయి. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాయి. అయినా ఓటర్లు కరుణించలేదు. వరుసగా పదేళ్లు తమను పాలించే అవకాశమివ్వలేదు. ఈ సంప్రదాయానికి తాజా ఎన్నికలతో ముగింపు కార్డు పడటం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అధికారంలో కొనసాగుతుందని ఇటీవల ఆరు ఒపీనియన్ సర్వేలు జోస్యం చెప్పాయి కూడా. ఈ విశ్లేషణలు, సర్వేల విశ్వాసం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు 'విజయన్'.
పాలనపై సంతృప్తి
కేరళలో ప్రస్తుతం రాజకీయాలన్నీ దాదాపుగా విజయన్ చుట్టూనే తిరుగుతున్నాయి! ఎన్నికలకు సంబంధించి జరిగే ప్రతి సంభాషణలోనూ ఆయన పేరు వినిపిస్తోంది. సీపీఎంకు అంతగా పట్టులేని కాసర్‌గోడ్ వంటి జిల్లాల్లోనూ విజయన్ సీఎంగా కొనసాగాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. "మాకు రాష్ట్ర మంత్రుల పేర్లు ఏంటో కూడా తెలియదు. తెలిసిందల్లా సీఎం ఒక్కరే. ఆయన ఆధ్వర్యంలో అన్ని మంత్రిత్వ శాఖలూ బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రే అన్నీ తానై వాటిని నడిపిస్తున్నారు. ఆయన పనితీరుపై అందరూ సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించట్లేదు" అని గల్ఫ్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన అహ్మద్ మిర్షద్ (కాసర్‌గోడ్) అనే వ్యక్తి చెప్పుకొచ్చారు. నిజానికి తాను 'ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)' మద్దతుదారుడినని, ఈ దఫా మాత్రం ఎల్‌డీఎఫ్‌కే ఓటేస్తానని మిర్షద్ పేర్కొన్నారు.
కఠిన సవాళ్లను దాటుకొని..
సీఎంగా గత ఐదేళ్లలో విజయన్ అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన హయాంలోనే రాష్ట్రాన్ని రెండేళ్లు వరదలు ముంచెత్తాయి. నిఫా వైరస్ ప్రబలడం, తర్వాత కొవిడ్ మహమ్మారి విజృంభించడం వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వాటన్నింటినీ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు.
సంక్షేమ పథకాలతో పెరిగిన ఆదరణ