ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో త్రిపుర ఎన్నికలు ఆసక్తికరంగా నిలుస్తున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఆ రాష్ట్రాలపై భాజపాకు పెద్దగా ఆశలు లేవు. త్రిపురలో మాత్రం తిరిగి అధికారం నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. 1993 నుంచి పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగిన కమ్యూనిస్టుల పాలనకు 2018 ఎన్నికల్లో భాజపా తెరదించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే త్రిపురలో మరోసారి గెలుపు భాజపాకు అత్యవసరం. మరోవైపు పూర్వవైభవం సాధించేందుకు సీపీఎం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకప్పటి ప్రత్యర్థి, ప్రస్తుతం రాష్ట్రంలో నామమాత్రంగా మారిన కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఓ వైపు భాజపా- ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ-బీ) కూటమి, మరోవైపు వామపక్ష-కాంగ్రెస్ కూటమి తలపడుతుండగా మూడో పక్షంగా 'ది ఇండీజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయెన్స్' (తిప్ర) రంగంలో ఉంది. 2021లో జరిగిన త్రిపుర స్వయంపాలిత జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో తిప్ర ఘన విజయం సాధించింది.
పొత్తులు.. కుమ్ములాటలు..
త్రిపురలోని 60 శాసనసభ స్థానాల్లో భాజపా 55 చోట్ల పోటీచేస్తూ అయిదు స్థానాలను మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి కేటాయించింది. సీపీఎం 43 స్థానాల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్‌కు 13, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, స్వతంత్ర అభ్యర్థికి ఒక్కో స్థానాన్ని కేటాయించింది. తిప్ర మోథా ఒంటరిగా 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. తిప్ర మోథా ప్రభావం 20 స్థానాలపై తీవ్రంగా పడనుంది. గత ఎన్నికల్లో భాజపా గెలుపులో ఐపీఎఫ్‌టీ కీలక పాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో ఐపీఎఫ్‌టీ ఎనిమిది స్థానాలు గెలవడమే కాకుండా మరో 10-15 స్థానాల్లో భాజపా గెలుపునకు దోహదపడింది. తిప్ర మోథా ఆవిర్భావంతో ఐపీఎఫ్‌టీ ప్రభావం తగ్గిపోవడంతో భాజపా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి అయిదు సీట్లు మాత్రమే కేటాయించింది. ఐపీఎఫ్‌టీ గిరిజనుల్లో పట్టు కోల్పోయిందనే కారణాన్ని భాజపా చూపడం ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఐపీఎఫ్‌టీ సిట్టింగ్ స్థానం ఆంపీనగర్‌లోనూ భాజపా తన అభ్యర్థిని ప్రకటించింది. భాజపా తీరును వ్యతిరేకిస్తూ ఐపీఎఫ్‌టీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సింధు చంద్ర జమాతియాను బరిలో నిలిపింది.