తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: దళితుల అండ దక్కేదెవరికో! - bengal elections dalit votes

బంగాల్​ ఎన్నికల్లో కీలకంగా మారనున్న దళిత ఓటర్లను ఆకర్షించేందుకు తృణమూల్​, భాజపాలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ దఫా దళిత ఓటర్లు తమకు గంపగుత్తగా మద్దతు పలుకుతారని భాజపా ఆశిస్తుండగా.. తాము చేపట్టిన దిద్దుబాటు చర్యల ద్వారా దళితుల ఓట్లు తమకేనని తృణమూల్​ విశ్వసిస్తోంది.

బంగాల్​ ఎన్నికలు 2021, bengal elections 2021 dalit votes
బంగాల్ ఎన్నికలు

By

Published : Apr 14, 2021, 12:35 PM IST

బంగాల్‌ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశమున్న దళిత ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు తృణమూల్, భాజపా పోటాపోటీగా ప్రణాళికలు రచిస్తున్నాయి. బంగాల్‌ జనాభాలో దళితుల వాటా 20 శాతం పైమాటే. దాదాపు 100-110 నియోజకవర్గాల్లో వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరు. వాటిలోని మెజారిటీ స్థానాలకు వచ్చే నాలుగు దశల్లోనే పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని దళిత వర్గాల్లో రాజ్‌బోంగ్శీ, మథువా అతిపెద్దవి. కూచ్‌ బిహార్, ఉత్తర బెంగాల్‌లోని ఇతర సరిహద్దు జిల్లాల్లో రాజ్‌బోంగ్శీలు ఎక్కువగా నివసిస్తున్నారు. దక్షిణ బెంగాల్‌లో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఆ ప్రాంతంలో 30-40 స్థానాల ఫలితాలను వారు ప్రభావితం చేయగలరు. ఒకప్పటి తూర్పు పాకిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చినవారు, వారి వారసులే మథువాలు.

దళితుల అండ దక్కేదెవరికో!

మొదలుపెట్టింది మమతే!

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ బంగాల్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధాంతాల ప్రాతిపదికనే పోరాటం కనిపించేది. 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలించిన కామ్రేడ్లు ఎన్నడూ సామాజిక సమీకరణాలను ప్రోత్సహించలేదు. తర్వాత క్రమంగా పరిస్థితులు మారాయి. తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వర్గాల వారీగా ఓటు రాజకీయాలను ప్రారంభించారు! మథువాల అధికార పీఠమైన 'మథువా ఠాకూర్‌బరి' సభ్యులకు 2011 ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం ఆమెకు కలిసొచ్చింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు కులు-జాతి అభివృద్ధి మండళ్లను ఆమె ప్రభుత్వం ఏర్పాటుచేయడం కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చింది. 2016లో 50 రిజర్వుడు స్థానాలను దీదీ పార్టీ గెల్చుకుంది.

తృణమూల్‌ దిద్దుబాటు చర్యలు

2019 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో 46 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కమలదళం అభ్యర్థులు మెజారిటీ ఓట్లు సాధించారు. వాటిలో 34 స్థానాలు.. మథువాల ప్రాబల్యమున్నవి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో వెంటనే తృణమూల్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించింది. వారికి భూ హక్కులు కల్పించింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులో జాప్యం, గందరగోళంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం ప్రచారంలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం 79 మంది దళిత అభ్యర్థులను ఆ పార్టీ ఎన్నికల బరిలో దించింది.

ధీమాగా భాజపా

రాష్ట్రంలో ఈ దఫా దళిత ఓటర్లు తమకు గంపగుత్తగా మద్దతు పలుకుతారని భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా సీఏఏను అమలు చేస్తామంటూ ఇస్తున్న హామీ; బౌరీ, బాగ్దీ వర్గాల కోసం ఆరెస్సెస్‌ చేసిన సేవ ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల బంగ్లాదేశ్‌ పర్యటనలో ప్రఖ్యాత ఒరాకండీ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మథువా ఆధ్యాత్మిక గురువు హరిచంద్‌ ఠాకూర్‌ జన్మస్థలం ఒరాకండీ. ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే మోదీ అక్కడికి వెళ్లారని విశ్లేషణలు వెలువడ్డాయి.

ఇవీ చదవండి :'భాజపా బెదిరింపు వ్యూహాలకు భయపడను'

'ప్రాథమిక దశలోనే జోక్యం వద్దు- విచారణ చేయనివ్వండి'

ABOUT THE AUTHOR

...view details