సహజంగా ఎవరైనా శునకాలను, పక్షులను పెంచుకుంటారు. కానీ కేరళ కాసర్గోడ్కు చెందిన అజీ మాత్రం.. ఎంతో ప్రేమతో ఓ ఉడుతను పెంచుకుంటున్నాడు. ఆ ఉడుత కోసం అన్నీ తానే అయ్యాడు. దానికి ముద్దుగా 'కిచ్చు' అని పేరు కూడా పెట్టాడు.
కేరళ ఆరోగ్యశాఖలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అజీ. సుమారు నెల క్రితం పెరియాలోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా అతనికి ఓ ఉడుత పిల్ల కనిపించింది. తల్లి ఉడుత వస్తుందనే ఆశతో ఆరోజు రాత్రి వరకు అక్కడే ఉండిపోయాడు. కానీ ఆ తల్లి ఉడుత రాలేదు. ఇక కళ్లు కూడా తెరవని పిల్ల ఉడుతను ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం మొదలుపెట్టాడు.
సమయానికి పాలు..
కిచ్చు అని పిలవగానే ఎక్కడున్నా పరుగెత్తుకుంటూ వస్తుంది ఆ చిట్టి ఉడుత. చటుక్కున అతని పైకి ఎక్కి చేతిలో వాలిపోతుంది. దానికి పాలు తాగిస్తాడు. చేతుల్లో కూర్చొపెట్టుకుని 'కిచ్చు'కు అలా పాలు తాగించటం తనకు చాలా ఇష్టమని మురిసిపోతున్నాడు. మూగజీవి పట్ల ప్రేమను చూపించే ఆ యువకున్ని చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు.