Orphan MBBS Seat: నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది శభానా షేక్. నా అనే వారు లేక అనాథ అయింది. ఆ సమయంలో మహారాష్ట్ర ఠాణె జిల్లా బద్లాపుర్‌లోని బాంబే టీన్ ఛాలెంజ్ విద్యా సంస్థ ఆమెను చేరదీసింది. విద్యతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించింది. తనకు ఎవరూ లేరని దిగులు చెందకుండా చదువుపై దృష్టి సారించింది ఆ బాలిక. ఎలాగైనా డాక్టర్ అయి 10మందికి సేవ చేయాలని సంకల్పించింది. తన కలను సాకారం చేసుకోవాలని అహర్నిశలు శ్రమించింది. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ దిశగా తొలివిజయం సాధించింది.
శభానా 'నీట్' పరీక్షలో అర్హత సాధించి ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించింది. ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది.
"నాలుగేళ్ల వయసులోనే బాంబే టీన్ ఛాలెంజ్‌కి వచ్చాను. నేను పెద్ద తరగతులు చేరుకునే కొద్దీ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎలాగైనా ఎంబీబీఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందాలనుకున్నా. నాకు అవసరమైన వాటన్నింటీని బాంబే టీన్ ఛాలెంజ్ సమకూర్చింది. 12వ తరగతి పాసయ్యాక సైన్స్ గ్రూప్ ఎంచుకున్నా. మహిళా, శిశుసంక్షేమ శాఖ డివిజన్ నాకు సాయం చేసింది. అనాథ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దాని వల్లే ఎంబీబీఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందగలిగాను. ఎంబీబీఎస్ సీటు కోసం ఒక సంవత్సరం పాటు కష్టపడి చదివా. క్లాసెస్‌తో సంతృప్తి చెందక మరో సంవత్సరం స్వయంగా చదువుకున్నా. ఎక్కువ సమయం కేటాయించి నైపుణ్యం పెంచుకున్నా. ఆ తర్వాత మంచి స్కోరు సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించా. కాలేజీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు."