అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారత అధికారులను స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. 120 మంది అధికారులను కాబుల్ విమానాశ్రయం నుంచి సీ-17 మిలిటరీ రవాణా విమానంలో భారత్ తీసుకొచ్చింది. గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ విమానం ల్యాండ్ అయింది. ఇంధనం నింపుకొన్న అనంతరం దిల్లీకి చేరుకుంది.
గుజరాత్ చేరుకున్న భారత అధికారులు వీరందరినీ సోమవారం సాయంత్రమే కాబుల్ విమానాశ్రయంలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించినట్లు పేర్కొన్నాయి.
గుజరాత్ చేరుకున్న భారత అధికారులు 'ఎంబసీని మూసేయలేదు'
అయితే, కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానిక సిబ్బంది కాన్సులర్ సేవలను అందిస్తున్నారని స్పష్టం చేశాయి. భారత్‌కు తిరిగి వచ్చేందుకు 1,650 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించాయి.
ఎలక్ట్రానిక్ వీసాలు
అఫ్గాన్.. తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. భారత్‌కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. 'ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా' పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్‌లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికా-భారత్ చర్చలు
కాబుల్‌లో విమాన కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్‌కు చేరుకున్న జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్లో మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితిపై ఇరువురు చర్చించారు. విమాన సేవలు పునరుద్ధరించే విషయంలో అమెరికా చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
అఫ్గాన్‌లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు జైశంకర్ స్పష్టం చేశారు. 'భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న వారి ఆందోళనను అర్థం చేసుకోగలం. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై చర్చలు జరుపుతున్నాం' అని ట్వీట్ చేశారు. కాబుల్‌లోని హిందూ, సిక్కు మత పెద్దలతో మాట్లాడుతున్నామని, వారి సంక్షేమమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
కాబుల్ నుంచి భారత అధికారులను ఖాళీ చేయించే విషయంపైనా అమెరికా అధికారులతో జైశంకర్ విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
భయాందోళనలు
20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాణభయంతో దేశం వీడి వెళ్లిపోవాలని సోమవారం కాబుల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో అఫ్గానీలు వచ్చారు. దీంతో విమానాశ్రయం బస్ స్టేషన్‌ను తలపించింది. కొందరైతే విమానం రెక్కలు పట్టుకుని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం టేకాఫ్ అయ్యాక కిందపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్ ప్రజలు
అఫ్గాన్ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే!
వీధుల్లో నిశ్శబ్దం.. గుండెల్లో అలజడులు