మహారాష్ట్ర తరహాలో త్వరలో తమిళనాడులోనూ అధికారం చేతులు మారుతుందని జోస్యం చెప్పారు భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. ఆ రాష్ట్రంలోనూ ఏక్నాథ్ శిందే లాంటి వ్యక్తి పుట్టుకొస్తారని విశ్లేషించారు. మహారాష్ట్రలో బాల్ ఠాక్రే, తమిళనాడులో కరుణానిధి కుటుంబాల మధ్య సారూప్యతల్ని వివరిస్తూ మంగళవారం చెన్నైలో జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నామలై.
"బాల్ ఠాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినిమాల్లోకి వెళ్లారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మొదటి కుమారుడు ముత్తు కూడా అంతే. ఇద్దరూ సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ అవి సరిగా ఆడలేదు. ఠాక్రే రెండో కుమారుడు కుటుంబానికి దూరంగా ఉన్నారు. కరుణ రెండో కుమారుడు అళగిరి కూడా అంతే. ఠాక్రే మూడో కుమారుడు ఉద్ధవ్‌కు మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం వచ్చింది. అదే తరహాలో స్టాలిన్ తమిళనాడు సీఎం అయ్యారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అంతే. ఇద్దరూ వారివారి పార్టీల యువజన విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు. తమిళనాడు.. మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా ఏక్నాథ్ శిందే పుట్టుకొస్తారు.