కరోనా మహమ్మారిపై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. వృత్తి రీత్యా కళాకారుడైన ఆయన.. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున యమ ధర్మరాజు(యమరాజ్) వేషధారణలో ప్రజల వద్దకు వెళ్లి కొవిడ్ నిబంధనల ఆవశ్యకతను గురించి వివరిస్తున్నారు. ఇలా.. మురాదాబాద్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారాయన.
మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే యమరాజ్ తన వెంట తీసుకెళతారని ప్రజల్ని మేల్కొలుపుతున్నారీ కళాకారుడు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కూడా ప్రజలకు సూచిస్తూ.. స్వచ్ఛంద సంస్థ తరఫున మాస్కులు, శానిటైజర్లు పంపణీ చేస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున.. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఎన్జీఓ సభ్యుడు అలోక్ రాథోడ్ తెలిపారు.