శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు అవకాశం కల్పించడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. దీంతో నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటల్ యజమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది.
కర్ణాటక పాల సమాఖ్యను, పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అటు బసవరాజ్ బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయం కర్ణాటకలో పాడిపరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని జేడీఎస్ సహా కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నందిని బ్రాండ్‌ను అమూల్‌లో విలీనం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని ఆరోపించాయి. కాగా అమూల్ పాలపై వస్తున్న రాజకీయ విమర్శలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు.
'మోదీ.. కర్ణాటక వస్తుంది దోచుకోవడానికా?'
బెంగళూరులో అమూల్ ఉత్పత్తుల విక్రయంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని.. నందినిని కాపాడాలని, వాటి ఉత్పత్తులను రక్షించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అమూల్ కొనబోమని, కేవలం నందిని పాలను కొంటామని కన్నడ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. లక్షలాది మందికి జీవనాధారమైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను మూసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయబోతోందని ఆరోపించారు.
"కర్ణాటకకు మోదీ వస్తుంది.. ఏమైనా ఇవ్వడానికా? లేదా ఇక్కడ ఉన్నవి దోచుకోవడానికా? కన్నడిగుల నుంచి ఇప్పటికే బ్యాంకులు, ఓడరేవులు, విమానాశ్రయాలు దొంగలించారు. ఇప్పుడు మా నుంచి నందిని దొంగిలించాలని చూస్తున్నారా? ఓడరేవులు, విమానాశ్రయాలను గుజరాత్‌లోని అదానీకి అప్పగించారు. ఇప్పుడు గుజరాత్‌కు చెందిన అమూల్.. మా నందిని పాల ఉత్పత్తులను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. మిస్టర్.. నరేంద్ర మోదీ.. మేము గుజరాతీలకు శత్రువులమా?" అంటూ సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.