ఖలిస్థానీ అనుకూల నాయకుడు, 'వారీస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్ విషయం చర్చనీయాంశంగా మారింది. అతడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతుండగా.. వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్ మాత్రం వాటిని ఖండిస్తున్నారు. అమృత్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా ఆరోపింస్తున్నారు. షాకోఠ్ పోలీస్ స్టేషన్ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అమృత్‌పాల్‌ను చంపేందుకు పోలీసులు ప్లాన్ వేస్తున్నారని ఆదివారం పేర్కొన్నారు ఇమాన్ సింగ్. ఫేక్ ఎన్కౌంటర్ నిర్వహించి అతడిని మట్టుబెట్టాలని యత్నిస్తున్నారని అన్నారు. అమృత్‌పాల్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.
"హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేశా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తినీ పోలీసులు కొట్టకూడదు. అమృత్‌పాల్‌ను షాకోఠ్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి ప్రాణాలకు ముప్పు ఉంది. ఇదే విషయం హైకోర్టు పిటిషన్లో ప్రస్తావించా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది పోలీసుల విధి. కానీ, ఇప్పటివరకు అమృత్‌పాల్‌ను కోర్టుకు తీసుకురాలేదు. పోలీసులకు ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్లో అతడిని చంపేయవచ్చు. తమకు దొరికిన ఈ టైమ్‌ను ఉపయోగించుకొని ఏదైనా పథకం రచించే ఛాన్స్ ఉంది."
-ఇమాన్ సింగ్ ఖారా, వారీస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్
ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ సింగ్ బాబాయ్ హర్జీత్ సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమృత్‌పాల్ డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ సైతం జలంధర్‌లోని మెహ్తాపుర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అమృత్‌పాల్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటివరకు 112 మంది అమృత్‌పాల్ అనుచరులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.