ఖలిస్థానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అమృత్‌పాల్ అనుచరులు కూడా అదే జైల్లో ఉన్నారు. అయితే అరెస్టు కావడానికి ముందు.. మోగా జిల్లాలోని రోడె గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృత్‌పాల్ ప్రసంగించినట్లు అధికారులు గుర్తించారు. అందులో ఇది ఏమాత్రం ముగింపు కాదని అతడు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ వేర్పటువాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే స్వగ్రామం కూడా రోడె కావడం గమనార్హం.
అమృత్‌పాల్‌ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని బఠిండా వాయుసేన కేంద్రానికి పోలీసులు తరలించారు. అక్కడి నుంచి నేరుగా అసోంకు తీసుకువెళ్లారు. వాస్తవానికి ఏప్రిల్ 14వ తేదీనే తల్వండిలోని దమ్‌దమ్ సాహెబ్ వద్ద పోలీసులకు.. అమృత్‌పాల్ లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించడం వల్ల అతడి పథకం సఫలం కాలేదు. మరోవైపు స్వర్ణదేవాలయం వద్ద కూడా పోలీసు బలగాలు అధికంగా ఉండటం కారణంగా.. అమృత్‌పాల్ రోడెను ఎంచుకొన్నట్లు తెలుస్తోంది.
అతడే సమాచారం ఇచ్చుకున్నాడా?
అమృత్‌పాల్ అరెస్టుపై పలు విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. అతడ్ని పోలీసులే అరెస్టు చేశామని చెబుతుండగా.. మరో వైపు రోడెవాల్ గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్ సింగ్ అనే వ్యక్తి మాత్రం మరో విధంగా చెబుతున్నారు. అమృత్‌పాల్ శనివారం రాత్రి గురుద్వారాకు వచ్చాడని ఓ ఆంగ్లవార్త సంస్థకు జస్బీర్ వెల్లడించారు. అతడు ఎక్కడ ఉన్నాడో పోలీసులుకు అమృత్‌పాలే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని తెలిపారు. ఆదివారం గురుద్వారాలో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఉదయం 7 గంటలకు.. అమృత్‌పాల్ లోంగిపోనున్నట్లు జస్బీర్ పేర్కొన్నారు. ఉదయం 7గంటల సమయంలో ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకొని.. అమృత్‌పాల్‌ని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
అరెస్ట్ అనంతరం మాట్లాడిన ఐజీపీ!
అమృత్‌పాల్ అరెస్ట్ అనంతరం పంజాబ్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుఖ్‌చైన్ సింగ్ గిల్.. మీడియాతో మాట్లాడారు. అమృత్‌పాల్ అరెస్ట్ కోసం నేషనల్ సెక్యురిటీ ఎజెన్సీ వారంట్ జారీ చేసిందని.. ఆదివారం అది అమలు జరిగిందని ఆయన వెల్లడించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పంజాబ్ పోలీసులు, నిఘా వర్గాల సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు.