తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రోజంతా 'ఆమె' ఇంట్లోనే అమృత్​పాల్.. పక్క రాష్ట్రాల్లోనూ పోలీసుల తనిఖీలు - అమృత్ పాల్ సింగ్ ఎవరు

ఖలిస్థాన్ అనుకూల నేత అమృత్​పాల్ కోసం పంజాబ్​తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హరియాణా కురుక్షేత్ర జిల్లాలో అమృత్‌పాల్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టయిన వారిని జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచుతున్నారు. గతవారం అమృత్​పాల్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు పంజాబ్‌లోని కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించగా.. తాజాగా కొన్ని చోట్ల సడలించారు.

amritpal latest news
amritpal latest news

By

Published : Mar 23, 2023, 4:59 PM IST

ఖలిస్థాన్​ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పంజాబ్ నుంచి అమృత్​పాల్ పారిపోయాడని భావిస్తున్న పోలీసులు... ఇతర రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలపై దృష్టిపెట్టారు. మహారాష్ట్ర ATS పోలీసులు కూడా హైఅలర్ట్‌లో ఉన్నారు. హరియాణా కురుక్షేత్ర జిల్లాలో అమృత్‌పాల్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళను బల్జీత్ కౌర్‌గా పేర్కొన్న హరియాణా పోలీసులు... అమృత్‌పాల్, అతని సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌కు ఆదివారం షాహాబాద్‌లోని తన ఇంట్లో ఆ మహిళ ఆశ్రయం ఇచ్చిందని చెప్పారు. నిందితురాలిని పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు.

ఈ క్రమంలోనే పలువురు అమృత్ పాల్ అనుచరులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అమృత్‌పాల్ సింగ్ ప్రైవేట్ సెక్యూరిటీలో భాగమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లూధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలోని మంగేవాల్ గ్రామానికి చెందిన తేజిందర్ సింగ్ గిల్... అమృత్‌పాల్ సింగ్‌కు వ్యక్తిగత భద్రత కల్పించే వారిలో ఒకరని చెప్పారు. అమృత్ కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు చిక్కినట్లు వివరించారు. మరోవైపు, పోలీసులు అదుపులోకి తీసుకున్న అమృత్‌పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్‌తో పాటు 11 మంది సహచరులను గురువారం పంజాబ్‌లోని బాబా బకాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయుధాల కేసులో అంతకుముందు న్యాయస్థానం.. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా గురువారంతో గడువు ముగిసింది.

ప్రత్యేక సెల్, స్పెషల్ సెక్యూరిటీ
అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృత్​పాల్ సింగ్ మేనమామ హర్జిత్ సింగ్‌, ఏడుగురు అనుచరులను ప్రత్యేక సెల్‌లలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వారందరినీ సీసీటీవీ నిఘాలో ఉంచినట్లు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన అధికారులు... జైల్లోని పరిసరాల్లో మరో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జైలు వెలుపలి ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను ఎలైట్ బ్లాక్ పాంథర్ అసోం పోలీసు కమాండోల బృందానికి అప్పగించామని ఉన్నతాధికారులు తెలిపారు. కారాగారం అంతర్గత భద్రతా బాధ్యతలను CRPF, అసోం పోలీసు సిబ్బంది, జైలు గార్డులకు ఇచ్చినట్లు వివరించారు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద హర్జిత్ సింగ్ సహా అమృత్‌సింగ్ ఏడుగురు అనుచరులను బహుళస్థాయి భద్రత మధ్య ఉంచారు.

ఇంటర్నెట్ ఆంక్షల సండలింపు...
అమృత్‌పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించినప్పుడు పంజాబ్‌లోని పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజాగా అమృత్‌సర్‌లోని మోగా, సంగ్రూర్, అజ్నాలా, మొహాలిలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్ధరించారు. తరన్ తారన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మాత్రం మొబైల్ ఇంటర్నెట్, SMS సేవల నిలిపివేతను శుక్రవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. పంజాబ్‌లోని మిగతా జిల్లాల్లో మంగళవారమే ఇంటర్నెట్‌ సేవలను తిరిగి ప్రారంభించారు. ప్రజా భద్రత దృష్ట్యా, హింస చెలరేగకుండా నిరోధించడానికి పంజాబ్ హోం వ్యవహారాల శాఖ, న్యాయశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేశాయి. బ్యాంకింగ్, ఆసుపత్రి సేవలు ఇతర అవసరమైన సేవలకు అంతరాయం కలగకుండా బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిలిపివేయలేదని ఉత్తర్వులో పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details