Amrit Kalash Yatra Delhi : దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మహాయజ్ఞం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకునేందుకు చేపట్టిన 'మేరీ మాటి మేరా దేశ్' కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు ( Azadi Ka Amrit Mahotsav ) ముగియనున్న నేపథ్యంలో.. దేశప్రజలంతా 'అమృతకాల' యాత్రను ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకునేందుకు కృషి చేయాలని కోరారు.
"దండి యాత్ర సమయంలో ప్రజలు ఎలాగైతే ఏకమయ్యారో, స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సమయంలోనూ అలాగే ఒక్కటయ్యారు. అన్ని ప్రాంతాలకు చెందినవారంతా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న విధంగానే.. అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అందరి వేడుకలా సాగింది. భారీగా ప్రజలు భాగస్వామ్యం కావడం వల్ల ఈ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమయంలో భారత్.. అనేక చారిత్రక విజయాలు నమోదు చేసింది. చంద్రయాన్-3 విజయం, వందేభారత్ రైళ్ల ప్రారంభం, దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి పరిణామాలు ఈ సమయంలోనే జరిగాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'మేరా యువ భారత్' లాంఛ్
అమృత్ కలశ్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టిని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు మోదీ. ఈ సందర్భంగా దేశంలోని యువత కోసం ఉద్దేశించిన 'మేరా యువ భారత్' ( MY Bharat platform ) వేదికను ప్రధాని ప్రారంభించారు. 21వ శతాబ్దిలో దేశాభివృద్ధికి మేరా మేరా భారత్ యువ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలోని యువత తమ లక్ష్యాలను కలిసికట్టుగా ఎలా సాధిస్తారో చెప్పేందుకు మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమం ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.