MP Navneet Rana: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయి, జుడీషియల్ కస్టడీలో ఉన్న మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయంలో బాత్రూమ్కు వెళ్లాలన్నా.. తన మాటను పోలీసులు వినలేదని ఆరోపించారు. అసభ్య పదజాలంతో ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. "తక్కువ జాతి వారు మా బాత్రూమ్లు వినియోగించుకునేందుకు ఒప్పుకోం" అంటూ మాట్లాడారని ఆరోపించారు నవనీత్. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు తన అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
" ఎన్నికల్లో ప్రజల తీర్పును మార్చి కాంగ్రెస్-ఎన్సీపీతో కూటమి ఏర్పాటు చేసేందుకే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తాను కట్టుబడిన హిందుత్వ నియమాలను పూర్తిగా పక్కనపెట్టేసింది. శివసేనలో హిందుత్వాన్ని నిద్రలేపేందుకే ముఖ్యమంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటించాం. మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించటం దాని ఉద్దేశం కాదు. హనుమాన్ చాలీసా చదివేందుకు మాతో పాటు చేయి కలపాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించాను. సీఎంకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే, మా ప్రకటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న కారణంగా మా ప్రయత్నాలను మానుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించాం. సీఎం ఇంటికి వెళ్లటం లేదని స్పష్టం చేశాం. నేను, నా భర్త రవి రాణా ఇంట్లోనే ఉండిపోయాం."
- నవనీత్ కౌర్ రాణా, అమరావతి ఎంపీ
ఏప్రిల్ 23న తనను ఖార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, ఆ రోజు రాత్రి అక్కడే ఉంచారని లేఖలో పేర్కొన్నారు నవనీత్ రాణా. రాత్రి పలుమార్లు మంచి నీళ్లు కావాలని కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాట్లాడిన మాటలకు ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. తాను ఎస్సీ కాబట్టే వారు తాగే గ్లాస్లో మంచి నీళ్లు ఇవ్వమని చెప్పారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు.