Amith Shah Chennai Visit : రాబోయే రోజుల్లో దేశానికి ఒక తమిళ వ్యక్తిని ప్రధాన మంత్రిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న షా.. ఆదివారం దక్షిణ చెన్నై పార్లమెంట్ బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. 'మేము (బీజేపీ) గతంలో రెండు సార్లు తమిళ వ్యక్తిని ప్రధాని చేసే అవకాశం కోల్పోయాము. దీనికి డీఎంకే పార్టీ ప్రధాన కారణం. భవిష్యత్లో తప్పకుండా తమిళ వ్యక్తి పీఎం రేసులో ఉంచేందుకు నిబద్ధతతో పనిచేస్తాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పేద కుటుంబంలో నుంచి రావాలి' అని అమిత్ షా అన్నారు.
రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీ 25 లోక్సభ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని.. దాని కోసం బూత్ కమిటీలను బలపర్చాలని కార్యకర్తలను షా కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఎంపీల సంఖ్య రెండంకెలకు చేరాలని ఆయన అన్నారు. తమిళనాడులో బీజేపీ కనీసం 25 స్థానాలను కైవసం చేసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు షా తెలిపారు. ఈ క్రమంలోనే దక్షిణ చెన్నైలో 60 శాతం పని పూర్తయినట్లు.. మిగిలిన 40 శాతాన్ని సెప్టెంబరులోపు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. 2024 ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంటును గెలిచేలా కష్టపడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.