Amitabh Bachchan Ayodhya House :బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో స్థలం కొన్నారు. 10వేల చదరపు అడుగుల భూమిని దాదాపు రూ.14.5కోట్లకు కొనుగోలు చేశారు. ముంబయికి చెందిన స్థిరాస్తి సంస్థ 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' అభివృద్ధి చేస్తున్న 'ది సరయు' ప్రాజెక్ట్‌లోనే ఈ స్థలం ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్ కొన్న విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించింది. అయితే ఇందుకోసం ఆయన చెల్లిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు.
"అయోధ్యలోని 'ది సరయు' ప్రాజెక్ట్ కోసం 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' గ్రూప్‌తో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో ఇల్లు కట్టునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే విషయమై ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా ఓ ప్రకటన విడుదల చేశారు. అయోధ్య నగర ఆర్థిక భవిత, ఆధ్యాత్మిక వారసత్వంపై ఉన్న విశ్వాసాన్ని అమితాబ్ బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ప్రాణప్రతిష్ఠ రోజే ప్రాజెక్ట్ లాంఛ్
45 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన సదుపాయాలతో ది సరయు ప్రాజెక్ట్‌ను చేపట్టింది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా గ్రూప్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సరయు నది ఒడ్డున ఓ హోటల్ కూడా ఉంటుంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22నే ది సరయు ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేయాలని భావిస్తోంది ఆ సంస్థ.